
Tungabhadra Dam at Risk: తుంగభద్ర జలాశయానికి మరో పెనుముప్పు.. దెబ్బతిన్న గేట్లతో ప్రమాద సూచనలు!
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీటిని అందించే కీలక తుంగభద్ర జలాశయం భద్రత మరోసారి ఆందోళన కలిగిస్తోంది. జలాశయంలో ఉన్న 33 గేట్లలో ఇప్పటికే పనిచేయని గేట్ల జాబితాలో తాజాగా మరో ఏడు గేట్లు చేరాయి. ఇంజినీర్ల తాజా పరిశీలనలో 4, 11, 18, 20, 24, 27, 28 గేట్లు సరిగా పనిచేయడం లేదని తేలింది. గతేడాది ఆగస్టు 10న 19వ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో స్టాప్‌లాగ్‌లను ఏర్పాటు చేసి తాత్కాలికంగా సమస్యను ఎదుర్కొన్నారు. ఇక వచ్చే ఏడాది జూన్ నాటికి మొత్తం 33 గేట్లను పూర్తిగా మార్చాలన్న లక్ష్యంతో జలాశయం సమీపంలోని గదగలో కొత్త గేట్ల నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
Details
ప్రమాదపుటంచుల్లో ఏడు గేట్లు
అయితే ఆ పనులు పూర్తి కాకముందే మరో ఏడు గేట్లు ప్రమాదకర స్థితికి చేరడం ఇంజినీర్లకు సవాల్‌గా మారింది. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ గేట్లను ఎత్తరాదని అధికారులు నిర్ణయించారు. కేవలం 4వ గేటును మాత్రం ఓ అడుగుదాకా ఎత్తవచ్చని, అంతకు మించి ప్రయత్నిస్తే అది మొరాయిస్తోందని గుర్తించారు. ఇక జలాశయానికి ప్రస్తుతం సుమారు 23 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. అందులో మూడు గేట్లను మాత్రమే పైకెత్తి 9 వేల క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. మిగిలిన వరదనీటిని కాలువల ద్వారా వదులుతున్నారు.
Details
మరింత వరద వచ్చే అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నందున ఎప్పుడైనా జలాశయానికి మరింత వరద వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో నిరుడు లక్ష క్యూసెక్కుల వరద చేరినప్పుడు 19వ గేటు కొట్టుకుపోయింది. అదే స్థాయిలో వరద ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉండటంతో, ఇప్పటికే దెబ్బతిన్న గేట్ల పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది.