Vande Bharat express: ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఏ రూట్లో అంటే..?
వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా ప్రజలు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రయాణికుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, కేంద్ర రైల్వే శాఖ ఈ రైళ్ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త రూట్లలో కూడా వందేభారత్ రైళ్లు నడపడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, విశాఖపట్టణం కోసం ఒక కొత్త వందేభారత్ రైలు ప్రారంభించేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే సిద్ధం అవుతోంది. ప్రస్తుతం విశాఖపట్నం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
విశాఖ-దుర్గ్ రూట్
విశాఖపట్నం కోసం ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, దుర్గ్-విశాఖపట్నం-దుర్గ్ మధ్య మూడో వందేభారత్ రైలు ప్రారంభించేందుకు ఒడిశా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ రైలు త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. దుర్గ్ నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 1:55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, విశాఖపట్నం-దుర్గ్ రైలు మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి, రాత్రి 10:50 గంటలకు దుర్గ్ చేరుకుంటుందని సమాచారం.
బెంగళూరు కోసం ఆసక్తి
ఆంధ్రప్రదేశ్ నుండి బెంగళూరుకు వందేభారత్ రైలు కోసం ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ రైలు నడపడంపై సమీక్ష జరుగుతోందని,ఈ ప్రతిపాదనపై ఏపీ ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలో మరొక వందేభారత్ అందుబాటులోకి రానుంది. లోక్ సభలో ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కొన్ని ప్రశ్నలు అడిగారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు విజయవాడ-ముంబాయి మధ్య వందేభారత్ రైలు నడపాలని కోరారు. అయితే, విజయవాడ-ముంబాయి మధ్య దూరం ఎక్కువ ఉండటంతో,ఆ రెండు స్టేషన్ల మధ్య పగటి సమయంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడపడం కష్టమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాలలో డిమాండ్
అయినప్పటికీ, విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం, కాచిగూడ నుండి యశ్వంత్ పూర్ కు వందేభారత్ అందుబాటులో ఉంది. విజయవాడ నుండి చెన్నైకు ప్రతీ రోజు వందేభారత్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో వందేభారత్ రైళ్లకు మంచి డిమాండ్ ఉంది. సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లకు వినియోగదారుల ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. విజయవాడ-చెన్నై మధ్య కూడా వందేభారత్ కు ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో, విజయవాడ-బెంగళూరు మధ్య కొత్తగా వందేభారత్ రైలు ప్రతిపాదన తెరపైకి వచ్చిందని సమాచారం. అలాగే, సికింద్రాబాద్-పూణే మధ్య వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.