Page Loader
Taj Mahal: తాజ్ మహల్ వద్ద అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు
తాజ్ మహల్ వద్ద అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు

Taj Mahal: తాజ్ మహల్ వద్ద అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన తాజ్‌ మహల్‌కి వచ్చిన ముప్పుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గగనతలంలో సంభవించే ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొనడానికి, అత్యాధునిక యాంటీ డ్రోన్ టెక్నాలజీని అక్కడ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. తాజ్‌మహల్‌ ఆవరణలో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు భద్రతా విభాగానికి చెందిన ఏసీపీ సయ్యద్ అరిబ్ అహ్మద్ వెల్లడించారు. ఈ సాంకేతిక వ్యవస్థ సుమారు 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతానికి, తాజ్‌మహల్ ప్రధాన గోపురానికి 200 మీటర్ల పరిధిలో ఈ వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తోందని చెప్పారు.

వివరాలు 

యాంటీ డ్రోన్ వ్యవస్థను నడిపేలా పోలీసు సిబ్బందికి శిక్షణ 

ఈ పరిధిలోకి ఏదైనా డ్రోన్ ప్రవేశించిన సందర్భంలో, అది ప్రసరించే సిగ్నల్స్‌ను గుర్తించి, స్వయంగా వాటిని జామ్ చేసి డ్రోన్‌ను పనిచేయకుండా చేసే విధంగా ఇది పనిచేస్తుందన్నారు. ఈ విధానాన్ని 'స్టాప్-కిల్'గా పిలుస్తున్నామని పేర్కొన్నారు. పోలీసు సిబ్బందిని ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థను నడిపేలా శిక్షణ ఇచ్చి, త్వరలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఏసీపీ తెలిపారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించబడే పర్యాటక ప్రదేశాల్లో తాజ్‌మహల్‌ ఒకటి. ప్రస్తుతం ఇక్కడ భద్రతా బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర పోలీసులు కలసి నిర్వహిస్తున్నారు. వీరికి తోడుగా, మరింత అధునాతనంగా పనిచేసే డ్రోన్ నిర్వీర్య వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు.