Bomb Threats: 2 వారాల్లో 400 బాంబు బెదిరింపులు.. అన్ని విమానాశ్రయాల్లో భద్రత పెంపు
ఇటీవల దేశంలో వరుస బాంబు బెదిరింపులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విమానాలకు సంబంధించి ఈ బెదిరింపులు పెద్ద కష్టాలను సృష్టిస్తున్నాయి. కేవలం రెండు వారాల్లోనే 400కి పైగా విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. ఇలాంటి సంఘటనలను పర్యవేక్షించడానికి, ఎన్‌ఐఏ సైబర్ విభాగం బెదిరింపు కాల్స్‌పై సమగ్ర విశ్లేషణను ప్రారంభించింది. బెదిరింపు కాల్స్ వెనుక ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.ఇతర భద్రతా సంస్థలతో కలిసి ఈ బెదిరింపులను పరిశీలిస్తూ ఉంది.
భారీ నష్టాలలో విమానయాన సంస్థలు
ప్రధాన విమానాశ్రయాల్లో బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ (BTAC) బృందాన్ని ఏర్పాటు చేయించింది. ఈ బృందం బెదిరింపులు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించడానికి శిక్షణ అందిస్తుంది. అంతేకాకుండా, విమానాశ్రయాల్లో భద్రతా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. గత కొన్ని రోజులుగా ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి అనేక విమానాలకు బెదిరింపులు వస్తున్నాయి. రోజుకు కనీసం వంద విమానాలకు ఇలాంటి బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో విమానాల ఆలస్యం అవుతుండగా, ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో విమానయాన సంస్థలు కూడా భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
బాంబు బెదిరింపులతో భారీ నష్టం
'విమానంలో బాంబు ఉంచాం'అని ఆకతాయిల ద్వారా వచ్చే హెచ్చరికలతో విమానాశ్రయాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఏ విమానానికి అయినా బాంబు బెదిరింపు వచ్చినప్పుడు,కచ్చితంగా బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ (BTAC)ప్రోటోకాల్,అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం తనిఖీ జరగాలి. దీనితో అనేక విమానాలు ఆలస్యం అవుతున్నాయి.ప్రస్తుతం ప్రయాణంలో ఉన్న విమానాలను వేరే విమానాశ్రయాలకు మళ్లించాల్సి వస్తోంది. ఫలితంగా,విమానయాన సంస్థలు నష్టపోతున్నాయి.గత తొమ్మిది రోజుల్లో వచ్చిన బాంబు బెదిరింపుల కారణంగా విమానయాన సంస్థలు దాదాపు 600కోట్ల రూపాయలు నష్టపోయాయని,గతంలో విమానయాన సంస్థలో పని చేసిన ఓ అధికారి వెల్లడించాడు. సాధారణంగా ఒక డొమెస్టిక్ విమాన సర్వీసుకు అంతరాయం కలిగితే సగటున రూ. 1.5కోట్ల నష్టం వస్తుంది,అంతర్జాతీయ విమానాలకు ఇది సుమారు రూ.3.5 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.