Rahul Gandhi: రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన బీజేపీ ఎంపీ
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా అభ్యంతరకరంగా పేర్కొంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ దాఖలు చేశారు. ఈ నోటీస్‌ను గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. తన ఫిర్యాదులో అనురాగ్ ఠాకూర్ పేర్కొన్న వివరాల ప్రకారం.. జూలై 29న లోక్‌సభలో అమిత్ షాను ఉద్దేశించి రాహుల్ గాంధీ అమర్యాదకరంగా మాట్లాడారని,అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా సభా మర్యాదలను ఉల్లంఘించారని ఆరోపించారు. విద్యార్థులతో జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ'విద్యార్థులు','మూర్ఖులు','అంధభక్తులు' అనే పదాలను ఉపయోగించారని, ఇందులో చివరి రెండు పదాలను రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే వారిని ఉద్దేశించి వాడినట్లు నోటీస్‌లో పేర్కొన్నారు.
వివరాలు
అమిత్ షాకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
లోక్‌సభ సెక్రటేరియట్ నియమావళిలోని 352(3), 352(7), 353 నిబంధనల ప్రకారం సభలో ఇలాంటి పదాల వినియోగంపై ఇప్పటికే నిషేధం ఉందని అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు.
అయినప్పటికీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసి సభా సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వెంటనే లోక్‌సభకు, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే రాహుల్ గాంధీ వ్యవహారాన్ని సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి పంపించి సమగ్ర విచారణ నిర్వహించిన అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని మూడు పేజీల నోటీస్‌లో అనురాగ్ ఠాకూర్ కోరారు.