SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో అన్వి రోబో మిషన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతం
ఈ వార్తాకథనం ఏంటి
దోమలపెంట SLBC టన్నెల్‌లో చిక్కుకున్న మరో ఏడుగురి ఆచూకీ కోసం సహాయక చర్యలు 18వ రోజుకు చేరుకున్నాయి.
సొరంగం లోపల టీబీఎం మిషన్ ముందు 50 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా మారాయి. దీంతో సహాయక బృందాల ప్రాణాలకు ముప్పు ఉండటంతో అన్వి రోబోను రంగంలోకి దించారు.
మంగళవారం ఉదయం 110 మంది సహాయక సిబ్బందితో పాటు అన్వి రోబో బృందం లోకో ట్రైన్ ద్వారా లోపల ప్రవేశించింది. ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చిన రోబోను నిపుణులు ఆపరేట్ చేస్తున్నారు.
మార్నింగ్ షిఫ్ట్‌లో లోపలికి వెళ్లిన బృందం మధ్యాహ్నం 2-3 గంటలకు తిరిగి వెలుపలకి రావాల్సి ఉంది.
Details
కార్మికుల ఆచూకీ కోసం విస్తృత ప్రయత్నాలు
సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో రెండు రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి.
కేరళ డాగ్స్, జీపీఆర్ సిస్టం ద్వారా గుర్తించిన D1, D2 ప్రదేశాల్లో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు సహాయక చర్యలు చేపట్టినా మిగిలిన ఏడుగురి ఆచూకీ మాత్రం తెలియరాలేదు.
సొరంగం లోపల చివరి పాయింట్ వద్ద పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారినందున, అక్కడ మృతదేహాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అందుకే, హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబో నిపుణులను సాయంగా ఉపయోగించుకుంటున్నారు.
లోకో ట్రైన్ ద్వారా 13.200 కిలోమీటర్ల దూరం వెళ్లి, అక్కడినుంచి 13.850 కిలోమీటర్ల వరకు కాలినడకన శిథిలాలు, మట్టి, బురద మధ్య జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంది.
Details
శిథిలాల తొలగింపు
టన్నెల్‌లో 150 మీటర్ల విస్తీర్ణంలో 16 అడుగుల ఎత్తుకు మట్టి, బురద, శిథిలాలు పేరుకుపోయాయి.
వీటిని తొలగించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. కేరళ క్యాడర్ డాగ్స్ సూచించిన ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి.
17 రోజులుగా నిరంతరం కృషి చేసిన రెస్క్యూ బృందాలు కార్మికుల జాడను కనుగొనలేకపోవడంతో, అన్వి రోబో ద్వారా వారి ఆచూకీ లభిస్తుందనే ఆశతో రోబోను రంగంలోకి దింపారు.
మానవుల కంటే రోబో సులభంగా చేరగల ప్రాంతాల్లో, శిథిలాల మధ్య సహాయక చర్యలను వేగవంతం చేయడానికి ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
టీబీఎం మిషన్ భాగాలు టన్నెల్‌ను పూర్తిగా కప్పివేసినందున, సహాయక బృందాలు వీటిని కట్ చేసి కుడి వైపు నుంచి లోపల ప్రవేశించేందుకు మార్గాన్ని ఏర్పాటు చేశారు.
Details
అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు
టన్నెల్‌లో నీటి ఊట కొనసాగుతుండటంతో, డీ-వాటరింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ సహాయక చర్యలను సమీక్షిస్తూ ఉన్నతాధికారులతో సమన్వయం చేస్తున్నారు.
14 బృందాలతో పాటు సింగరేణి కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. లోపల ప్రవేశించిన సిబ్బంది తమ వెంట నీటి బాటిళ్లు, బిస్కెట్లు, టిఫిన్, అవసరమైన సహాయక సామగ్రిని తీసుకెళ్లారు.
సహాయక చర్యలు మరింత వేగంగా కొనసాగుతున్నాయి.