
AP: ఆర్5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సచివాలయం వేదికగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో వరుస కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ పెండింగ్ ఫైళ్ల దుమ్ముదులుపుతున్నారు. ఈ మేరకు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు చర్యలను వేగవంతం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ మేరకు పలు కీలకమైన ప్రాజెక్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ క్రమంలోనే స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో పలు ప్రాజెక్టులకు గతంలో ఆమోదం లభించింది. వాటికి తాజా కేబినెట్ భేటీలో మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది.
సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గంలో అమరావతి సీఆర్‌డీఏ పరిధి ఆర్5 జోన్‌లో ఉన్న 47 వేల నివాసలను నిర్మించేందుకు ఆమోదం ప్రకటించింది.
DETAILS
భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి, లంక భూములకు ఆమోదం
మరోవైపు శ్రీకాకుళం జిల్లా భావనపాడు-మూలపేటలో పోర్టు నిర్మించేందుకు ఉద్దేశించిన రూ.3,880 కోట్లు రుణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ మేరకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకునేందుకు సమ్మతించింది. అలాగే రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి, లంక భూముల కేటాయింపునకు ఆమోదించింది.
అన్నమయ్య జిల్లాలోని వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీ కంపెనీకి సంబంధించిన 1500 మెగావాట్ల పంపెడ్ స్టోరేజీ ప్రాజెక్టుకి సైతం ఆమోదం లభించింది.
టిడ్కో కాలనీల్లోని 260 ఎకరాలను విక్రయించి, హడ్కో నుంచి రూ. 750 కోట్లు రుణంగా తీసుకునే ప్రతిపాదనలకు సైతం అంగీకారం తెలిపింది.
గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 454 కోట్ల పరిహారం ప్యాకేజీని మంజూరీకి ఒకే చెప్పింది.