LOADING...
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. 20కిపైగా అంశాలపై చర్చ
నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. 20కిపైగా అంశాలపై చర్చ

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. 20కిపైగా అంశాలపై చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో మరో కొద్ది సేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో దాదాపు 20కిపైగా అజెండా అంశాలను కేబినెట్‌ ఆమోదించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ సర్క్యులర్‌ ఎకానమీ, వేస్ట్‌ రీసైక్లింగ్‌ పాలసీ 2025-30పై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే, పర్యాటక ప్రాజెక్టుల కోసం భూముల కేటాయింపుకు ప్రభుత్వం సిద్ధం చేసిన మార్గదర్శకాలపై కూడా చర్చ జరగనుంది. అధికారిక భాషా కమిషన్‌కు "మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాషా కమిషన్" అనే పేరు ఇవ్వడంపై కేబినెట్‌ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. ఇక, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే ప్రక్రియలో అవసరమైన చట్ట సవరణలకు కూడా ఈ సమావేశంలో ముద్ర వేయనుంది.

వివరాలు 

అమరావతి 29 గ్రామాల్లో రూ.904 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల అభివృద్ధికి గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి అభివృద్ధి సంబంధిత అంశాలు కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. 51వ సీఆర్‌డీఏ సమావేశం ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదించనుందని సమాచారం. అమరావతిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల అభివృద్ధికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారు. అలాగే, సీఆర్‌డీఏ పరిధిలోని వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపై ఉపసంఘం చేసిన సిఫార్సులకు కూడా కేబినెట్‌ ముద్ర వేసే అవకాశముంది. గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణకు సంబంధించి ఏపీ జీఎస్‌ అండ్‌ డబ్ల్యూఎస్‌ చట్టం-2022లో అవసరమైన సవరణలు చేయాలన్న ప్రతిపాదనపై కూడా చర్చ జరగనుంది. అదేవిధంగా, ఈ సచివాలయాల్లో డిప్యూటేషన్‌ మరియు ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 2,778 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది.

వివరాలు 

విదేశీ మద్యం బ్రాండ్లపై టెండర్‌ కమిటీ చేసిన సిఫార్సులకు కేబినెట్‌ పచ్చజెండా

మద్యం సంబంధిత అంశాలపై కూడా నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా మద్యం ప్రాథమిక ధరలు మరియు విదేశీ మద్యం బ్రాండ్లపై టెండర్‌ కమిటీ చేసిన సిఫార్సులకు కేబినెట్‌ పచ్చజెండా ఊపనుంది. అంతేకాకుండా,ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లును కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ప్రాంతీయ అభివృద్ధి ప్రాజెక్టులపైనా కేబినెట్‌ ఆమోదం లభించనుంది. కాకినాడ జిల్లా గన్నేపల్లి మండలంలోని తాలూరు గ్రామంలో తోట వెంకటాచలం పుష్కర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం కింద ప్రధాన కాల్వ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపే అవకాశముంది.

వివరాలు 

క్రీడాకారులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం

అదే విధంగా, చింతూరులో ప్రస్తుతం ఉన్న 50 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు, అందుకు అవసరమైన 56 కొత్త పోస్టులను సృష్టించేందుకు కూడా కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. క్రీడాకారులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారుడు సాకేత్‌కు స్పోర్ట్స్‌ కోటా కింద డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం కల్పించడానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇక పంచాయతీరాజ్‌ చట్టంలోని కొన్ని సెక్షన్ల సవరణకు కూడా కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం.