ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్..స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఆయనే సూత్రధారన్న సీఐడీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం కొనసాగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబుపై ఏసీబీ కోర్టుకు సీఐడీ రిమాండ్ రిపోర్టు సమర్పించింది. ఈ మేరకు సంచలన అభియోగాలను పొందుపర్చింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని, నిందితులతో కలిసి చంద్రబాబే కుట్రకు తెరతీశారని, కేసులో ఆయనే ప్రధాన సూత్రధారని వెల్లడించింది. సీఎంగా, ఆయన ఆదేశాల మేరకే నిధులు విడుదలయ్యాయని తెలిపింది. టీడీపీ నేత ఇల్లందుల రమేశ్ ద్వారా డిజైన్‌టెక్, సీమెన్స్ ప్రతినిధులు చంద్రబాబును కలిశారని వివరించింది. రిమాండ్ రిపోర్టులో నారా లోకేశ్ పేరు కూడా సీఐడీ జోడించింది. చంద్రబాబు సన్నిహితుడు కిలారి రాజేశ్, లోకేశ్‌కు డబ్బులు ఇచ్చినట్లు రిపోర్టులో సీఐడీ చెప్పింది.
98 శాతం ఖర్చు సీమెన్స్ భరిస్తుందని కేబినెట్‌కు అబద్ధాలు చెప్పారు
మంత్రివర్గ తీర్మానాలను సైతం పక్కన పెట్టి గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ద్వారా చంద్రబాబు కుట్ర పన్నారని తెలిపింది. అచ్చెన్నాయుడు నేతృత్వంలో స్కిల్ డెవలప్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ల ఆధారంగానే ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించినట్లు పేర్కొంది. ప్రాజెక్టుపై మార్కెట్ సర్వే చేయకుండానే, సీమెన్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్‌కు రూ.3,281 కోట్ల ఫైల్ మంత్రివర్గం ముందుంచగా దాన్ని ఆమోదించారని సీఐడీ రిపోర్టులో పేర్కొంది. 98 శాతం ఖర్చు సీమెన్స్ భరిస్తుందని మంత్రివర్గానికి అబద్ధాలు చెప్పి బ్యాంకు గ్యారెంటీ లేకుండానే ప్రభుత్వం రూ.371 కోట్లను డిజైన్‌టెక్‌కు కట్టబెట్టిందన్న సీఐడీ, 28పేజీల రిపోర్టును ఏసీబీ కోర్టుకు సమర్పించింది.