Free Gas Cylinder Scheme AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు సమర్ధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో, ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేసేందుకు "పర్సెప్షన్ ట్రాకింగ్" సమీక్ష నిర్వహించి, అధికారుల పనితీరు పరిశీలించారు.
క్రమశిక్షణ లోపం, అలసత్వం, అవినీతి వంటి అంశాలు కనపడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో పారదర్శకంగా, సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని సూచించారు.
వివరాలు
లబ్ధిదారుల నుంచి అనేక ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న "దీపం" పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
లబ్ధిదారుల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతో, దీనిపై అధికారుల వివరణ కోరారు.
"ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నా, డెలివరీ సమయంలో లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం అందింది. ఇది తీవ్రంగా పరిగణించాలి. వెంటనే విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి," అని సీఎం ఆదేశించారు.
అలాగే, సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోనే ప్రభుత్వ సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతున్నా, వాటిని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
వివరాలు
ప్రభుత్వ శాఖల పనితీరును పర్సెప్షన్ ట్రాకింగ్
రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి అవినీతి సహించబోమని, లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు స్పష్టం చేశారు.
"కొన్ని ప్రాంతాల్లో రేషన్ పంపిణీ సమయంలో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందిస్తున్నప్పుడు, ప్రజల నుంచి అనవసరంగా డబ్బు వసూలు చేయడం అంగీకారయోగ్యం కాదు," అని సీఎం తీవ్రంగా స్పందించారు.
ప్రభుత్వ శాఖల పనితీరును పర్సెప్షన్ ట్రాకింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని,ప్రజల నుంచి నేరుగా అందుతున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేపడతామని చంద్రబాబు తెలిపారు.
"ప్రతి వారం సమీక్ష నిర్వహించి,జిల్లాల వారీగా ర్యాంకులు కేటాయిస్తాం. వెనుకబడి ఉన్న జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలి," అని సీఎం సూచించారు.
వివరాలు
తప్పు చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు
గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నిర్వహణకు ఏర్పాటు చేసిన 5,859 కంపోస్ట్ తయారీ కేంద్రాల పనితీరును సీఎం సమీక్షించారు.
"ఈ కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి. మొక్కుబడి పనితీరుతో మార్పు రాదు. గత ప్రభుత్వ పాలనకూ, మా ప్రభుత్వ పాలనకూ స్పష్టమైన తేడా ఉండేలా అన్ని శాఖలు పనిచేయాలి," అని చంద్రబాబు తెలిపారు.
చివరగా, "ప్రజలే ప్రథానం" అనే సూత్రంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, అందుకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు పూర్తి నిబద్ధతతో పని చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
"ప్రజా సేవలో నిర్లక్ష్యం, అవినీతికి ఏమాత్రం తావు ఉండకూడదు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వెంటనే సరిచేయాలి. తప్పు చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటాం," అని ఆయన హెచ్చరించారు.