
నేడు దిల్లీకి సీఎం వైఎస్ జగన్..వర్షాకాల సమావేశాల వేళ మోదీతో కీలక భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. నేటి సాయంత్రం ఆయన హస్తినాకు పయనం కానున్నారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవనున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ పెండింగ్ అంశాలు, రావాల్సిన నిధుల గురించి ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం.
ఇదే పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో సహా పలువురు కేంద్రమంత్రులను సైతం జగన్ కలిసే అవకాశం ఉంది.
ఈ మేరకు జగన్ మూడు రోజుల పాటు దిల్లీలోనే ఉండనున్నారు. దీంతో రాష్ట్రంలో మరోసారి నిధుల వరద పారనున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నెల 6న గురువారం దిల్లీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుగు పయనం కానున్నారు.
DETAILS
దిల్లీ పెద్దలతో సీఎం జగన్ వరుస భేటీలు
మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సమీపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఉమ్మడి పౌరస్మృతి, దిల్లీలో పరిపాలన అంశాల వంటి వివాదాస్పద బిల్లులు సైతం ఉన్నాయి.
అయితే ఆయా బిల్లులు నెగ్గాలంటే రాజ్యసభలో అధికార పార్టీకి వైసీపీ మద్దతు అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే సదరు బిల్లులకు సహకరించాలంటూ జగన్ సపోర్ట్ ను మోదీ కోరే అవకాశం ఉంది.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు, ఏపీ విభజన హామీల అమలతో పాటు మూడు రాజధానుల అంశాలపైనా దిల్లీ పెద్దలతో జగన్ చర్చించే అవకాశం ఉంది.
ఇందుకు సంబంధించి ఆయా వినతి పత్రాలను సైతం ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలకు అందించనున్నారు.