Pawan Kalyan Deeksha: మెట్ల మార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం.. అక్కడే 'ప్రాయశ్చిత్త దీక్ష'
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ఉపయోగించినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్ష విరమించడానికి తిరుమల కొండకు వెళ్లాలని నిర్ణయించారు. ఆయన మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళ్ళనున్నారు. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని, 2న శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నట్లు తెలిపారు. 3న తిరుపతిలో వారాహి సభను నిర్వహించనున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై పవన్ కల్యాణ్ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం
అపచారం జరిగిపోవడంతో 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు ఆయన పూనుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో, పవన్ వెంకటేశ్వర స్వామిని క్షమించాలని ప్రార్థించారు. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఆలయం మెట్లను ఆయన శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దుర్గమ్మను పవన్ దర్శించుకున్నారు.
చర్చికి లేదా మసీదుకు జరిగితే జగన్ ఊరుకుంటారా: పవన్
దీక్ష సందర్భంగా పవన్ కల్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చర్చికి లేదా మసీదుకు జరిగితే జగన్ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. హిందూ ధర్మానికి జరిగినప్పుడు ఎందుకు వెనుకదోవలుకుతున్నారని నిలదీశారు. కేబినెట్, అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాలని, సీబీఐ విచారణ జరగాలా లేదా అనే నిర్ణయం తీసుకోవాలని సీఎం నిర్ణయించాలని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రజలు ఆయన వెనుక నిలబడతారని అభిప్రాయపడ్డారు. నెయ్యి తక్కువ ధరకు ఇస్తారని చెప్పిన మధ్యవర్తి ఎవరో తేలాలని పవన్ అన్నారు.
టీటీడీపై శ్వేతపత్రం
"స్వామివారి పూజా విధానాలను మార్చారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో టిక్కెట్లు అమ్మించారు. వైసీపీ పాలనలో 300 ఆలయాలను అపవిత్రం చేశారు. ఏ మతమైనా కావచ్చు, ఏ ప్రార్థనా మందిరం కావచ్చు, మనోభావాలు దెబ్బతినకూడదు. ప్రసాదాలు కల్తీ అవుతున్నాయని, నాణ్యతలో లోటు ఉన్నదని మేము ముందుగా చెబుతున్నాం. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నాం. ఈ స్థాయిలో కల్తీ జరుగుతుందనే ఊహించలేదు. దారుణం ఏంటంటే అయోధ్యకు లక్ష లడ్డూలు పంపించారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్నారని వైసీపీ అంటోంది. రామతీర్థం దేవుడి విగ్రహం ధ్వంసం జరిగినప్పుడు మాత్రమే నేను రోడ్ల మీదకు వచ్చాను. ఆ రోజున నేను రాజకీయం చేయలేదు" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.