Loading...
Andhra Pradesh: రూ.100కే కిలో కందిపప్పు.. రూ.25కే గోధుమపిండి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రూ.100కే కిలో కందిపప్పు.. రూ.25కే గోధుమపిండి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh: రూ.100కే కిలో కందిపప్పు.. రూ.25కే గోధుమపిండి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రేషన్‌ దుకాణాల ద్వారా రాయితీ ధరలకు కందిపప్పు, గోధుమపిండి, పామోలిన్‌ ఆయిల్‌ను పంపిణీ చేయనుంది. కిలో కందిపప్పు రూ.100, కిలో గోధుమపిండి రూ.25, లీటరు పామోలిన్‌ ఆయిల్‌ రూ.125 చొప్పున కార్డుదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

వివరాలు 

ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు

నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంతో పాటు సామాన్యులకు అందుబాటు ధరల్లో సరుకులు అందించాలని ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలోనూ రాయితీపై నిత్యావసర సరుకుల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు.

మార్కెట్‌ జోక్య పథకం కింద ఈ కార్యక్రమానికి నెలకు రూ.100.20 కోట్ల చొప్పున మూడు నెలలకు మొత్తం రూ.300.60 కోట్లు రాయితీగా కేటాయించనున్నారు.

ఈ నిధులతో నిత్యావసర సరుకులను సేకరించి రేషన్‌ దుకాణాల ద్వారా ప్రజలకు అందించనున్నారు.

వివరాలు 

కందుల సేకరణకు కేంద్రం కేటాయింపులు

ధరల స్థిరీకరణ నిధి కింద రాష్ట్రానికి 1.20 లక్షల టన్నుల కందులు కేటాయించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

అయితే కేంద్రం 40,338 టన్నుల కందులను మాత్రమే కేటాయించింది.

ముడి కందుల లభ్యతను బట్టి వాటిని సేకరించి, కందిపప్పు తయారీకి అవసరమైన ఒప్పందాలు చేసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఎండీ, వీసీని ఆదేశిస్తూ ఆ శాఖ కమిషనర్‌ కన్నబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే పామోలిన్‌ ఆయిల్‌ కొనుగోళ్లను పారదర్శకమైన పోటీ విధానంలో చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

మూడు నెలల తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏర్పడితే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు.

ADVERTISEMENT