Andhra Pradesh: ఏపీ సర్కార్ ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎంఎస్ఎంఈ పరిశ్రమ విజయవాడలో ఏర్పాటు..
రాయలసీమ కరువు సంక్షోభంలో పడ్డ నాటి నుండి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కడపకు కూత వేటు దూరంలోని కొప్పర్తిలో పారిశ్రామిక వాడను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. భారీ పరిశ్రమలు వస్తాయి.. నిరుద్యోగ సమస్య తీరుతుందని ఆశల పల్లకిలో ఊరేగుతున్నయువతకు ఎన్డీఏ ప్రభుత్వం చేదువార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పరిశ్రమను విజయవాడలో ఏర్పాటు చేసేలా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపిందట. రాజధాని అమరావతిలో 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కంటెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
గుంటూరు జిల్లాలో మరో కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల భూమిని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖకు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. విశాఖలో ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటైన తొలి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ తరహాలో గుంటూరు జిల్లాలో మరో కేంద్రం ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. కడప నగరానికి అత్యంత సమీపంలో ఉన్న కొప్పర్తిలో 6914ఎకరాల ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం ఇక్కడ 30 కంపెనీలు,మధ్య చిన్న తరహా పరిశ్రమలతో సహా,తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌కు సమీపంలో రోడ్డు, విమాన, రైల్వే సౌకర్యాలు ఉండడం వల్ల పరిశ్రమలు ఏర్పాటు అయితే, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని గత ప్రభుత్వాలు భావించారు.
ఎంఎస్ఎంఈ పరిశ్రమ కడప నుండి విజయవాడకు
ఈ నేపథ్యంలో, వైసిపి ప్రభుత్వం కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఎంఎస్ఎంఈ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి నివేదికలు పంపింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ పరిశ్రమను కడప నుండి విజయవాడకు తరలించనున్నట్లు సమాచారం. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ద్వారా యువతకు ప్రథమ స్థాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, వివిధ ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సుల డిప్లమా,పోస్ట్ డిప్లమా,పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ప్రోగ్రాములు అందించబడతాయి.
నిరుద్యోగుల అసంతృప్తి
కొప్పర్తి పారిశ్రామిక వాడ నుంచి విజయవాడకు తరలించడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరువు కష్టాల మధ్య, భారీ పరిశ్రమల లేకుండా ఉన్న రాయలసీమలో యువతకు ఇది చేదు వార్తగా మారింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా దీనిపై విమర్శలు చేస్తూ దుమ్మెత్తి పోస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కొప్పర్తి క్యారిడార్‌లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి లక్షలాది యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు.