ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఒంటిపూట బడులు
జూన్ 15 సమీపిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా వేసవికాలమే తాండవిస్తోంది. ఓ వైపు తీవ్రత ఉష్ణోగ్రతలు, వడగాలుల దృష్ట్యా పిల్లలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో జూన్ 12 నుంచి పాఠశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు బడిగంట మోగుతోంది. ఆటలు మాయమై పుస్తకాలతో బీజీ బీజీగా గడిపేస్తున్నారు. మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏపీ సర్కార్ స్కూళ్ల నిర్వహణపై పనఃసమీక్షించింది. ఈ మేరకు జూన్ 17 వరకు ఒక్క పూట బడులు మాత్రమే నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకే క్లాసులు
అధిక ఎండ వేడి, వడగాలుల నేపథ్యంలో ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. వడ గాలుల తీవ్రత నేపథ్యంలోనే స్కూల్స్ రీ ఓపెన్ డేట్ వాయిదా వేయాలని ప్రతిపక్షాలు, తల్లిదండ్రుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ఆయా ప్రతిపాదనలను తొసిపుచ్చిన ప్రభుత్వం, అధికారులతో చర్చల అనంతరం ఒక్క పూట బడులు నిర్వహించేందుకే మొగ్గు చూపడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఒంటి పూట క్లాసుల నిర్వహణను సమర్థిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.