
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్'లో సంక్షేమ పథకాలు అమలుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ప్రభుత్వం..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు,మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలుపై పూర్తిగా దృష్టి సారించింది.
వాటిని ఒకొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. అయితే, ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రజల్లో నిజంగా సంతృప్తి ఉందా? లేదంటే ఎక్కడైనా అసంతృప్తి ఉందా? అనే కోణాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈ ఉద్దేశంతోనే, ప్రస్తుతం అమలవుతోన్న వివిధ పథకాలపై ప్రజల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను (ఫీడ్‌బ్యాక్) సేకరిస్తోంది.
ఈ ఫీడ్‌బ్యాక్ ప్రక్రియలో ప్రభుత్వం ఎదుర్కొన్న కొన్ని అంశాలు ఆశ్చర్యానికి గురిచేశాయి.
ముఖ్యంగా సామాజిక పెన్షన్లు, ఆరోగ్య సేవలు, రెవెన్యూ శాఖ సేవలు, పోలీసు వ్యవస్థ వంటి రంగాల్లో తీసుకున్న అభిప్రాయాల్లో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
వివరాలు
రియల్ టైమ్‌లో మానిటరింగ్
ఉదాహరణకు, సామాజిక పెన్షన్ల విషయంలో కొందరు లంచం డిమాండ్ చేస్తున్నారని ఫీడ్‌బ్యాక్ ద్వారా అధికారులకు తెలియజేయబడింది.
అదే విధంగా, మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో పోలీస్ వ్యవస్థ సరైన విధంగా పని చేయడం లేదని కూడా ప్రజలు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో, ఉద్యోగుల పనితీరును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం కొత్త వ్యవస్థను రూపొందించడానికి సిద్ధమవుతోంది.
అధికారులు, ఉద్యోగుల పనితీరు తక్షణంగా (రియల్ టైమ్‌లో) మానిటరింగ్ అయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది.
అందులో భాగంగా, ప్రజలకు సేవలందించడంలో ఎవరు ఎంతగా ముందున్నారు? వారి పనితీరు ఎలా ఉంది? అనే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది ప్రభుత్వం.