AP Govt: జగన్ కు ఏపీ ప్రభుత్వం షాక్.. సరస్వతి పవర్‌లో అసైన్డ్ భూములను వెనక్కి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సంబంధించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు కేటాయించిన అసైన్డ్ భూములను వెనక్కు తీసుకుంది. ఈ చర్యలో భాగంగా పల్నాడు ప్రాంతంలోని భూములను స్వాధీనం చేసుకుంటూ స్థానిక తహసీల్దార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ భూములను పరిశీలించారు. జగన్ భూములను అక్రమంగా చేజిక్కించుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై జగన్ తన స్పందనను తెలియజేస్తూ, సంబంధిత అధికారుల నివేదికలను ప్రస్తావించారు.
1324.93 ఎకరాల భూమి అక్రమంగా కబ్జా
జగన్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు వైఎస్ హయాంలో భూముల కేటాయింపు జరిగింది, అయితే అప్పటి నుంచే ఈ కేటాయింపులపై వివాదం చోటు చేసుకుంది. అనంతరం ఈడీ కూడా ఈ భూములను అటాచ్ చేసింది. జగన్, షర్మిల వివాదం నేపథ్యంలో సరస్వతి పవర్ సంబంధిత అంశాలపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ఇటీవల పవన్ పరిశీలన సమయంలో, 1324.93 ఎకరాల భూమి అక్రమంగా కబ్జా అయ్యిందని ఆరోపించారు. అంతేకాకుండా, ఈ భూముల్లో 34 ఎకరాల అసైన్డ్ భూమి కూడా ఉందని పవన్ పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్న సమయంలో ఈ భూములను 50 ఏళ్లకు లీజుగా తీసుకున్నట్టు జీవో జారీ చేయించారని ఆయన ఆరోపించారు.
పల్నాడులోని సరస్వతి పవర్‌లో 17.69 ఎకరాల అసైన్డ్ భూములు
ఈ ఆరోపణలపై జగన్ మాట్లాడుతూ, తన ప్రభుత్వం సమగ్ర విచారణ చేయించి, ఎలాంటి ప్రభుత్వ భూములు కబ్జా చేయలేదని నివేదికలో తేలిందని స్పష్టంచేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం భూములపై నిర్ణయం తీసుకోవడంతో కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ వివరించగా,ఇతర సంస్థలు ఇచ్చిన ధర కంటే ఎక్కువ చెల్లించి ఈ భూములను పొందినట్టు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా తీసుకున్న చర్యలో భాగంగా పల్నాడులోని సరస్వతి పవర్‌లో 17.69 ఎకరాల అసైన్డ్ భూములను వెనక్కు తీసుకుంది. ఇందులో మాచవరం మండలం వేమవరంలో 13.80 ఎకరాలు,పిన్నెల్లిలో 3.89 ఎకరాలు ఉన్నాయి. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో,జగన్ ప్రభుత్వం నిర్ణయంపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.