Page Loader
Vangalapudi Anitha: సొంత నియోజకవర్గంలో ఏపీ హోంమంత్రి అనితకు చేదు అనుభవం
సొంత నియోజకవర్గంలో ఏపీ హోంమంత్రి అనితకు చేదు అనుభవం

Vangalapudi Anitha: సొంత నియోజకవర్గంలో ఏపీ హోంమంత్రి అనితకు చేదు అనుభవం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

విద్య ప్రతి ఒక్కరి మౌలిక హక్కు. అయితే, విద్యా రంగం వ్యాపారరంగంగా మారిపోతున్న ఈ కాలంలో, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలలే దిక్కు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న ఎక్కువ శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతూ,వసతి అవసరాల కోసం ప్రభుత్వ హాస్టళ్లపైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ హాస్టళ్లలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు కాలక్రమేణా బయటపడుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటన వెలుగులోకి తెచ్చిన అసలు పరిస్థితి భయానకంగా ఉంది. విద్యార్థినులు ఉంటున్న ప్రభుత్వ హాస్టల్ బాత్‌రూమ్‌లకు తలుపులు లేకపోవడంతో, చున్నీలతో తాత్కాలికంగా తలుపులు వేసుకొని తమ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారు. ఇదే సమయంలో మరో ప్రాంతంలో మౌలిక వసతుల కొరత మరోసారి బయటపడింది.

వివరాలు 

బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించిన హోమ్ మంత్రి 

ఈసారి ఈ దారుణ పరిస్థితిని ఏకంగా ఓ మంత్రిగారే ప్రత్యక్షంగా అనుభవించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఇటీవల తన నియోజకవర్గం పాయకరావుపేటలో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా అక్కడి బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించారు. హాస్టల్ వసతులపై విద్యార్థినులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. వారి మధ్య కాసేపు గడిపిన మంత్రి అనిత, విద్యార్థినులతో కలిసి భోజనానికి కూడా కూర్చున్నారు. అయితే అక్కడ వడ్డించిన భోజనంలో ఓ బొద్దింక కనిపించడంతో మంత్రిగారు పూర్తిగా ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడి సిబ్బంది, విద్యార్థులు అందరూ ఈ దృశ్యం చూసి షాక్‌కు గురయ్యారు.

వివరాలు 

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్

పిల్లలకు ఇలాంటి భోజనం అందిస్తున్నారా అంటూ మంత్రి అక్కడి వంటమనుషులపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యంతో ఆహారం అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని ఖచ్చితంగా అమలు చేయడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, కొందరిని విధుల నుంచి తొలగించకపోతే మార్పు రాదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "ఒక హోంమంత్రికి ఇలా జరగితే.. సామాన్య విద్యార్థినుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో?" అంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

వివరాలు 

హాస్టల్‌లో సీసీ కెమెరాలు

ఈ నేపథ్యంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మంత్రి పర్యటన సమయంలో హాస్టల్ వార్డెన్ అక్కడ లేకపోవడం, భోజనం సరిగా సిద్ధం చేయకపోవడం, మెనూ ప్రకారం ఆహారం ఇవ్వకపోవడం వంటి అంశాలు మంత్రి దృష్టికి వచ్చాయి. ఇవన్నీ పరిశీలించిన వంగలపూడి అనిత, ఈ అంశాలపై రెండు రోజులలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు బాగా చదువుకోవాలని సూచించారు. హాస్టల్‌లో సీసీ కెమెరాలు వెంటనే ఏర్పాటు చేయాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏపీ హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక ...