ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్.. మాకే ముందస్తు ఎన్నికలు అక్కర్లేదు: మంత్రి పెద్దిరెడ్డి
శాసనసభకు, లోక్ సభకు ఎన్నికలకు ఒకేసారి జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఒంటరి గానే ఎన్నికల బరిలో నిలుస్తుందన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు రాజకీయ వైకల్యంతో బాధపడుతున్నారని, అందుకే ఇతరుల సాయం కోసం ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనేది తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే జరిగిన తెదేపా మహానాడులో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆ పార్టీ మేనిఫెస్టోను ఏపీ జనం నమ్మరన్నారు పెద్దిరెడ్డి. మొన్నటి కర్ణాటక మేనిఫెస్టోను, సీఎం జగన్ మేనిఫెస్టోను కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకొస్తారని చురకలు అంటించారు.
జగన్ కు మేనిఫెస్టో అంటే ఓ కురాన్, ఓ బైబిల్, ఓ భగవద్గీత : పెద్దిరెడ్డి
సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి, ఆ పార్టీకి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక కూడా భాజపాను తెచ్చుకునేందుకు దిల్లీకి చక్కర్లు కొడుతున్నాడని మంత్రి ఎద్దేవా చేశారు. ఇందుకోసమే పొత్తుల కోసం హస్తీనా బాటపడుతున్నాడని ఆరోపించారు. వైఎస్సాఆర్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పార్టీ మేనిఫెస్టో అంటే ఓ కురాన్, ఓ బైబిల్, ఓ భగవద్గీతతో సమానమని మంత్రి అన్నారు. హామీ ఇస్తే మాట తప్పకుండా నవరత్నాల్లో 99 శాతం పథకాలు అమలు చేశారని స్పష్టం చేశారు. లంచాలను అరికట్టేందుకు నేరుగా ప్రజల వద్దకే సంక్షేమాన్ని తీసుకెళ్లిన ఘనత జగనన్నకే దక్కుతుందని చెప్పారు. 2024 ఎన్నికల్లో జగన్ ను మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.