చిరంజీవి ఏపీకి చేసిందేమీ లేదు: మెగాస్టార్‌పై రోజా విమర్శలు
వాల్తేరు వీరయ్య 200రోజుల సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలో చిరంజీవిపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వేదికల మీద రాజకీయలు మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లాలో బుధవారం ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న రోజా మీడియాతో మాట్లాడారు. చిరంజీవి కేంద్రమంత్రిగా ఉండి ఏపీకి చేసిందేమీ లేదని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చిరంజీవి ఏం చేశారన్నారు. ఒకవేళ చిరంజీవి సలహా ఇవ్వాలనుకుంటే, తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఇచ్చుకోవాలని రోజా సలహా ఇచ్చారు. చిరంజీవి చెబితే వినేస్థాయిలో తాము లేమన్నారు.
సినిమా హీరోల రెమ్యునరేషన్ గురించి మేము మాట్లడలేదు: రోజా
ప్రభుత్వ పెద్దలు తమ ప్రతాపాన్ని సినిమా పరిశ్రమపై చూపొద్దని వాల్తేరు వీరయ్య 200రోజుల సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ఏపీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమ మీద ప్రతాపాన్ని చూపకుండా సంక్షేమంపై దృష్టి పెడితే, ప్రజలు మెచ్చుకుంటారని చిరంజీవి అన్నారు. అయితే చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రోజా మాట్లాడారు. చిరంజీవి ఏ సందర్భంలో ఆ మాటలు మాట్లాడారో తనకు తెలియదన్నారు. ఏపీ సీఎం గానీ, మంత్రులు గానీ ఎప్పుడు సినిమా హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదన్నారు. సీఎం జగన్‌కు సంక్షేమం, అభివృద్ధి విషయంలో చిరంజీవి సలహా ఇవ్వడం సరికాదన్నారు.