
AP Rains Update: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. వారం రోజులు భారీ వర్షాలు!
ఈ వార్తాకథనం ఏంటి
కరువు భయంతో విలవిలలాడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. గురువారం, శుక్రవారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా, రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా పేర్కొంది. ఆగ్నేయ ఉత్తర్‌ప్రదేశ్ వద్ద ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారి బలపడిందని, దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడినట్టు అధికారులు పేర్కొన్నారు. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కూడా నమోదయ్యాయి.
వివరాలు
కోస్తా జిల్లాల్లో మరో ఐదు రోజులపాటు బలమైన గాలులు వీచే అవకాశం
ఈ వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వివరించింది. కోస్తా జిల్లాల్లో మరో ఐదు రోజులపాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గత 24 గంటల్లో విజయనగరం జిల్లాలో అత్యధికంగా 12 సెంమీ వర్షపాతం నమోదయ్యిందని తెలిపింది. వర్షాలు లేక కష్టాలు పడుతున్న రైతులకు ఇది నిజమైన ఊరట కలిగించే విషయం అని చెప్పవచ్చు.