Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు.. సర్వేలో విస్తుపోయే నిజాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో జీవనశైలి వ్యాధులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) 4.0 స్క్రీనింగ్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కొత్త బీపీ, షుగర్ కేసులను గుర్తించారు. ఈ సర్వేలో ఏకంగా 12.23 లక్షల మందికి కొత్తగా హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు), 11.58 లక్షల మందికి డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వివరాలతో రూపొందించిన నివేదికను సోమవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అధికారులు అందజేశారు.
వివరాలు
14 నెలల పాటు కొనసాగిన సర్వే
2025 సెప్టెంబర్ 17 నుంచి 2026 నవంబర్ 10 వరకు దాదాపు 14నెలల పాటు ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన సుమారు 2.85కోట్ల మందికి బీపీ,షుగర్‌తో పాటు నోటి క్యాన్సర్ పరీక్షలు చేశారు.
అలాగే 1.46కోట్ల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో వెలుగుచూసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం బీపీ బాధితుల సంఖ్య 59.63 లక్షలకు చేరింది.
ఇది రాష్ట్ర వయోజన జనాభాలో 13.93 శాతంగా ఉంది. ఇక డయాబెటిస్ బాధితుల సంఖ్య 48.95 లక్షలకు చేరుకోగా.. ఇది వయోజన జనాభాలో 11.45 శాతంగా నమోదైంది.
వివరాలు
క్యాన్సర్ కేసులు కూడా భారీగానే..
వీరిలో సుమారు 34 లక్షల మంది బీపీ, షుగర్ రెండు సమస్యలతోనూ బాధపడుతున్నట్లు సర్వే వెల్లడించింది.
ఈ స్క్రీనింగ్ కార్యక్రమంలో మొత్తం 12,768 క్యాన్సర్ కేసులను గుర్తించారు.
వీటిలో 3,339 నోటి క్యాన్సర్ కేసులు, 5,832 రొమ్ము క్యాన్సర్ కేసులు, 3,597 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు ఉన్నాయి.
మరోవైపు వయసు పెరిగే కొద్దీ ఈ వ్యాధుల ముప్పు మరింత ఎక్కువవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో 47.60 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతుండగా.. 43.39 శాతం మందికి మధుమేహం ఉన్నట్లు తేలింది.
వివరాలు
ఈ జిల్లాల్లో ఎక్కువ కేసులు
జిల్లాల వారీగా పరిశీలిస్తే హైపర్‌టెన్షన్ కేసులు తూర్పు గోదావరి, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో ఎక్కువగా నమోదయ్యాయి.
డయాబెటిస్ కేసుల విషయంలో తూర్పు గోదావరి, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్ కడప జిల్లాలు ముందున్నాయి.
వివరాలు
ముందస్తు గుర్తింపుతోనే ముప్పు తగ్గింపు
కుటుంబ సంక్షేమ కమిషనర్, జాతీయ ఆరోగ్య మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ సి. శ్యామల ఈ సర్వే నివేదికను మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అందజేశారు.
వ్యాధులు ఉన్నట్లు గుర్తించిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోందని అధికారులు తెలిపారు.
జీవనశైలి వ్యాధులు ముదిరితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
అందువల్ల బీపీ, షుగర్‌తో పాటు క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు.