Srikakulam: బ్యాంకులో 7కేజీల బంగారం మాయం.. గోల్డ్ కస్టోడియన్ బ్యాంక్ మహిళా అధికారి ఆత్మహత్య
బ్యాంకుల్లో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమైంది. ఈ మధ్య తరచుగా ఇటువంటి ఉదంతాలు జరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా గారా ఎస్.బీ.ఐలో దాదాపుగా 7 కేజీల బంగారం చోరీకి గురైంది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించే బ్యాంకు మహిళా అధికారి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఖాతాదారులు, తమ రుణాలను తీర్చేసినా వాళ్ల బంగారం ఇంకా అందలేదు. ఈ మేరకు బ్యాంకులో ఉన్న పసిడి అంతా ఎవరో దోచేశారు. తమ బంగారం ఇచ్చేయాలని గత కొద్ది రోజులుగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు ఆరా తీసిన బ్యాంక్ అధికారులు 7 కిలోల వరకు బంగారం మాయమైనట్లు గుర్తించి విస్మయానికి గురయ్యారు.
ఆడిట్ కారణంగానే జాఫ్యం
ఈ క్రమంలోనే గోల్డ్ కస్టోడియన్ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడ్డారు. చోరీకి గురైన బంగారం విలువ దాదాపు రూ.4 కోట్లగా ఉంటుందని అంచనా. సదరు ఖాతాదారులు రుణాలు, బకాయిలు తీర్చేసుకున్నా వారికి బంగారం వెనక్కి ఇవ్వలేదు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. బంగారం చోరీ ఇంటి దొంగల పనే అన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే విచారణకు ముందే బ్యాంకులో పని చేస్తున్న మహిళా అధికారిణి బలవన్మరణానికి పాల్పడటం కలకలం సృష్టించింది. మరోవైపు శ్రీకాకుళం రీజనల్ మేనేజర్, ఆడిట్ కారణంగానే జాప్యం జరుగుతోందని, వదంతులు నమ్మొద్దని బాధితులకు సర్దిచెప్పారు. డిసెంబర్ 8 వరకు వేచి ఉండాలని,ఈలోగా బంగారం అప్పగిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.
బంగారం కోసం ఖాతాదారుల ఆందోళన
బ్యాంకులో ఆడిట్ జరుగుతున్న సందర్బంగా గోల్డ్ లోన్స్ బాధ్యతలు చూసే 39ఏళ్ల డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ నవంబర్ 29న ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంగారం పక్కదారి పట్టడంతోనే ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారనే అనుమానాలున్నాయి. బంగారం మాయం వ్యవహారంలో ఉద్యోగుల ప్రమేయంపై ప్రచారం విస్తృతమైంది.దీంతో మరోసారి ఖాతాదారులు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. నగలు మాయమైన సంగతి అంతర్గత విచారణలో వెల్లడైనా, అధికారులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బంగారం గల్లంతు వ్యవహారంలో స్వప్నప్రియను బాధ్యురాలిని చేస్తూ,నవంబర్ 20 నుంచి సెలవుపై పంపారు ఉన్నతాధికారులు. ఈ క్రమంలో రెండుసార్లు విచారణకు పిలిపించారు. డిసెంబర్ 8న ఖాతాదారులకు కచ్చితంగా బంగారం అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.ఈలోపే మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడడంతో గురువారం పోలీసులను ఆశ్రయించారు.