Article 370: ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 16 రోజుల పాటు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. సుప్రీంకోర్టులో ఆర్టికల్ 370 కేసులో పిటిషనర్‌గా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జస్టిస్ (రిటైర్డ్) హస్నైన్ మసూది ఈ సందర్భంగా స్పందించారు. తాను చేసిన వాదనలతో సంతృప్తి చెందానని తెలిపారు.
రాత పూర్వక వాదనలకు మూడు రోజుల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు
చివరి రోజు విచారణలో సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణియమ్, రాజీవ్ ధావన్, జఫర్ షా, దుష్యంత్ దవే, తదితరుల వాదనలు వినిపించారు. అలాగే రాతపూర్వక వాదనలు దాఖలు చేయాలనుకునే పిటిషనర్లు లేదా ప్రతివాదుల తరపున వాదించే న్యాయవాదులకు సుప్రీంకోర్టు మూడు రోజుల గడువు విధించింది. అయితే, ఆ వాదనలు రెండు పేజీలకు మించకూడదని కోర్టు షరతు విధించింది. 16 రోజుల విచారణ ప్రక్రియలో సుప్రీంకోర్టు వివిధ న్యాయ ప్రముఖుల వాదనలు విన్నది. ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, రాకేష్ ద్వివేది, వి.గిరి వాదనలు వినిపించారు.