Amaravati: రాజధాని అమరావతిలో మరో రూ.8,821.14 కోట్ల పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ₹8,821.14 కోట్ల విలువైన పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం ఇచ్చింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 42వ అథారిటీ సమావేశంలో 20 పనులకు అనుమతి లభించింది. గత 41వ సమావేశంలో ₹11,467.27 కోట్ల పనులకు ఆమోదం ఇవ్వగా, ఇప్పటివరకు మొత్తం ₹20,288.41 కోట్ల పనులకు ఆమోదం జరిగింది. ఈ నెలాఖరుకల్లా 99.9% పనులకు టెండర్లు పిలుస్తామని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. తొలివిడతకు సంబంధించిన పనుల కోసం నాలుగైదు రోజుల్లో టెండర్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, తాజా ఆమోదం పొందిన పనులకు మంత్రివర్గ ఆమోదం తర్వాత టెండర్లు పిలుస్తామని తెలిపారు.
45% పెరిగిన నిర్మాణ వ్యయం
ఈ సమావేశంలో ₹4,521.11 కోట్లతో ప్రధాన రహదారుల నిర్మాణానికి,₹3,807.73 కోట్లతో భూములిచ్చిన రైతులకు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధికి,₹492.30 కోట్లతో మంత్రులు,హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. 1200-1500కిలోమీటర్ల రహదారులలో ప్రస్తుతానికి 236కిలోమీటర్లకు అనుమతి లభించగా,360 కిలోమీటర్ల ప్రధాన రహదారుల నిర్మాణంలో 97.5 కిలోమీటర్ల పనులు 14ప్యాకేజీలుగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. మొత్తం నిర్మాణ వ్యయం 45% పెరిగిందని,2019కి ముందు అంచనా వేసిన ₹41 వేల కోట్ల బడ్జెట్ ప్రస్తుతం ₹60 వేల కోట్లకు చేరిందని నారాయణ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పనులు నిలిపివేయడం వల్ల వ్యయాలు పెరిగాయని,కొనసాగిస్తే వ్యయం 25-45% తగ్గేదని అన్నారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ సంస్థలతో మళ్లీ చర్చలు చేయడం ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపారు.