APSRTC Dasara Special Buses : ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ - అక్టోబరు 3 నుంచి దసరా ప్రత్యేక బస్సులు
దసరాకు ఊరెళ్తున్నారా? మీకు గుడ్ న్యూస్! ఏపీఎస్ఆర్టీసీ ఈసారి గతేడాది కంటే ఎక్కువ ప్రత్యేక బస్సులను నడిపించడానికి నిర్ణయించింది. 960కుపైగా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రం నలమూలల నుండి కాకుండా, పక్క రాష్ట్రాల్లోని ప్రయాణికులను కూడా గమ్యస్థానాలకు చేరుస్తున్నది. శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతున్నాయి. దసరా పండగ అక్టోబర్ 12న జరుగుతుంది.అదే రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. అక్టోబర్ 4 నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, చాలా మంది తమ స్వగ్రామాలకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. వీరిని సులభంగా గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 13 వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సేవలు అందిస్తారు.
బెంగళూరు, మరికొన్ని నగరాలకు కూడా ప్రత్యేక బస్సులు
గతేడాది మాదిరిగా, ఈసారి కూడా హైదరాబాద్ నగరానికి అధిక సంఖ్యలో సేవలు అందించనున్నది ఏపీఎస్ఆర్టీసీ. 300కి పైగా ప్రత్యేక బస్సుల సర్వీసులు అందించే అవకాశం ఉంది. బెంగళూరు, మరికొన్ని నగరాలకు కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నాయి. గత ఏడాది దసరా సమయంలో ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.2.35 కోట్ల ఆదాయం పొందిన ఏపీఎస్ఆర్టీసీ, ఈ ఏడాది అధిక సేవల ద్వారా మరింత ఆదాయం పొందాలని ఆశిస్తోంది.
దసరా సెలవుల సమయం
ఈ ఏడాది ఏపీలో మొత్తం 10 రోజులు సెలవులు రానున్నాయి. విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ 4 నుండి సెలవులు ప్రారంభమవుతాయి, అక్టోబర్ 13తో ముగుస్తాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉండటంతో, ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. అక్టోబర్ 3 మినహాయించి, అక్టోబర్ 13 వరకు హాలీ డేస్ ఉంటాయి. అక్టోబర్ 14 సోమవారం స్కూళ్లు,కాలేజీలు పునఃప్రారంభమవుతాయి. ఒకవేళ ప్రభుత్వం అక్టోబర్ 3న కూడా సెలవు ఇస్తే, 13 రోజుల పాటు హాలీ డేస్ ఉంటాయి. దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రానుంది.
దీపావళి సెలవులు
అక్టోబర్ నెలలో దీపావళి పండగ కూడా రాబోతుంది. అక్టోబర్ 31న దీపావళి జరగడంతో, ఆ రోజున రాష్ట్రంలోని అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవు ఉంటుంది. మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29 వరకు ఉంటాయి. సంకాంత్రి సెలవులు 2025 జనవరి 10 నుండి 19 వరకు ఉంటాయి, కానీ మైనారిటీ విద్యా సంస్థలకు జనవరి 11 నుండి 15 వరకు సెలవులు ఇవ్వనున్నారు.