Page Loader
Pollution: హైదరాబాద్‌ నగరంలో పెరిగిన వాయు కాలుష్యం.. టీజీఎస్‌పీసీబీ హెచ్చరిక 
హైదరాబాద్‌ నగరంలో పెరిగిన వాయు కాలుష్యం.. టీజీఎస్‌పీసీబీ హెచ్చరిక

Pollution: హైదరాబాద్‌ నగరంలో పెరిగిన వాయు కాలుష్యం.. టీజీఎస్‌పీసీబీ హెచ్చరిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2025
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నగరంలో వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో ఇది తీవ్రమైన సమస్యగా మారుతోంది. విద్యుత్తు కోతల కారణంగా జనరేటర్ల వినియోగం అధికమవుతున్నదని,దీంతో వాయు నాణ్యత మరింతగా క్షీణిస్తున్నదని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో, హైదరాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సనత్‌నగర్‌ ప్రాంతంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. సోమవారం మధ్యాహ్నం 431ఏక్యూఐ నమోదు అయినట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తెలిపారు. ఇక నగర వ్యాప్తంగా సగటు 108 ఏక్యూఐగా నమోదైందని,జూపార్‌లో 135,పటాన్‌ చెరువులో 112 ఏక్యూఐ ఉన్నప్పటికీ గ్రేటర్‌ పరిధిలో గాలి నాణ్యతను సూచించే 14స్టేషన్లలో ఎక్కడా 100ఏక్యూఐ దాటలేదని వివరించారు.

వివరాలు 

సనత్‌నగర్‌లో కాలుష్యం ఎక్కువగా ఎందుకు? 

సనత్‌నగర్‌ ఒక ఇండస్ట్రియల్‌ ప్రాంతం కావడంతో అక్కడ సహజంగానే గాలి నాణ్యత తక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో నవంబర్‌ 25న 298, డిసెంబర్‌లో 229,జనవరిలో 171 ఏక్యూఐ నమోదైనప్పటికీ,సోమవారం ఏకంగా 431 ఏక్యూఐ చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నదని తెలిపారు. సనత్‌నగర్‌లో ఎయిర్‌ క్వాలిటీ పరీక్షించే మీటర్‌ సమీపంలో రెండు కంపెనీల జనరేటర్లు ఉన్నాయని, వాటి వల్లే గాలి నాణ్యత మరింత క్షీణించిన అవకాశముందని టీజీఎస్‌పీసీబీ సీనియర్‌ శాస్త్రవేత్త ప్రసాద్‌ తెలిపారు. గాలి ప్రవాహం పెరిగినప్పుడు కాలుష్య స్థాయిలు తగ్గే అవకాశం ఉందని, సోమవారం నమోదైన 431 ఏక్యూఐ జనరేటర్ల ప్రభావం వల్లే కావచ్చని, దీనికి అధికంగా భయపడాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు.