Page Loader
మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు 
మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు

మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు 

వ్రాసిన వారు Stalin
May 07, 2023
01:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో హింస నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, పౌరులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైన్యం, అస్సాం రైఫిల్స్‌‌ను రంగంలోకి దింపింది. ఈ క్రమంలో హింస నుంచి ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌‌ బలగాలు ఇప్పటివరకు దాదాపు 23,000 మంది పౌరులను విజయవంతంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. వారిని ప్రభుత్వ స్థావరాలకు పంపినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, చురాచంద్‌పూర్‌లో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. అయితే ఆ సమయంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదని అధికారులు ప్రకటనలో వెల్లడించారు. అన్ని కమ్యూనిటీల్లోని పౌరులను రక్షించడానికి, హింసను అరికట్టడానికి, సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి గత 96 గంటలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న 120-125 ఆర్మీ, అస్సాం రైఫిల్స్ దళాలు పని చేస్తున్నాయి.

మణిపూర్

ఇంఫాల్ లోయలో వైమానిక నిఘా 

అంతకుముందు మే 3న చెలరేగిన హింస నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల కారణంగా మణిపూర్‌లోని హింసాత్మకమైన జిల్లా చురచంద్‌పూర్‌లో యంత్రాంగం పూర్తి కర్ఫ్యూ విధించింది. గత 24గంటల్లో సైన్యం ఇంఫాల్ లోయను వైమానిక నిఘాతో నిత్యం పర్యవేక్షిస్తోంది. భద్రతా బలగాల జోక్యంతో రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి డౌంగెల్ తెలిపారు. మణిపూర్‌లో ఆర్‌ఎఎఫ్, బిఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌తో సహా బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) చీఫ్ కుల్దీప్ సింగ్‌ను భద్రతా సలహాదారుగా నియమించారు. మణిపూర్‌లో పరిస్థితిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇంటెలిజెన్స్), అశుతోష్ సిన్హాను మొత్తం కార్యాచరణ కమాండర్‌గా నియమించినట్లు రాష్ట్ర డీజీపీ తెలిపారు.