
Swan Singh: పంజాబ్ బాలుడికి సైన్యం అండ.. ఎవరీ శ్వాన్ సింగ్?
ఈ వార్తాకథనం ఏంటి
పదేళ్ల బాలుడు శ్వాన్ సింగ్ చేసిన సహాయం ఇప్పుడు గొప్ప గుర్తింపుని తెచ్చింది. పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పుర్ జిల్లాలోని తారావాలీ గ్రామానికి చెందిన శ్వాన్ సింగ్ చదువుకు కావాల్సిన మొత్తం ఖర్చును భరించేందుకు భారత సైన్యం పరిధిలోని గోల్డెన్ యారో డివిజన్ ముందుకొచ్చింది. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తారావాలీ గ్రామంలో ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో శత్రుదేశంతో ఘర్షణ వాతావరణంలో భారత బలగాలు మోహరించాయి. అదే సమయంలో స్థానికంగా ఉన్న శ్వాన్ సింగ్ అనే పసిబాలుడు సైనికులకు అవసరమైన మద్దతు అందించేందుకు ముందుకు వచ్చాడు.
Details
బాలుడి సేవలను ప్రశంసించిన సైనికాధికారులు
మంచినీళ్లు, పాలు, చాయ్, లస్సీ వంటి అవసరాలను స్వయంగా సమకూర్చుతూ ఆయన తన వయసుకి మించి సేవలు అందించాడు. బాలుడి తపన, సమర్పణను గమనించిన సైనికాధికారులు ఆయన సేవలను ప్రశంసించారు. తాజాగా ఫిరోజ్‌పుర్ కంటోన్మెంట్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో వెస్ట్రన్ కమాండ్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ చేతుల మీదుగా శ్వాన్ సింగ్‌ను సత్కరించారు. అలాగే ఈ బాలుడి చదువుకు అవసరమైన మొత్తం ఖర్చును భారత సైన్యం భరించనుందని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా శ్వాన్ లాంటి ధైర్యవంతులైన చిన్నారులకు గుర్తింపు, సహాయం అందాల్సిన అవసరం ఉందని లెఫ్టినెంట్ జనరల్ వ్యాఖ్యానించారు.