AAP: ఆప్ కు రాజకీయ సమాధి కట్టే బిజెపి కుట్రకి నిరసనగా ర్యాలీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ,బీజేపీ కి మధ్య వివాదం రోజు రోజుకీ తీవ్రమవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు తనపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆ పార్టీకి,రాజ్యసభ ఎంపి స్వాతి మలివాల్ మధ్యమాటల యుద్ధం కొనసాగుతోంది. మలివాల్ వెనుక కమలం పార్టీ ఉందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.ఇందుకు నిరసనగా ఇవాళ బిజెపి కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆప్ ప్రకటించింది. ఇందులో భాగంగా నిరసన ప్రదర్శన జరపనున్నారు.ఆప్ తన మెగా నిరసనకు అనుమతి కోరలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా బిజెపి కార్యాలయం ఉన్న డిడియు మార్గ్ వద్ద ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ,CRPF సిబ్బందిని కూడా మొహరించారు.
బిభవ్ కుమార్ అరెస్ట్, రిమాండ్
ఇదిలావుండగా మే 13న జరిగిన దాడి కేసుకు సంబంధించి శనివారం అరెస్టయిన కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ను ఆదివారం ముఖ్యమంత్రి నివాసానికి తీసుకెళ్లి నేర ఘటనను మరింత లోతుగా విచారించనున్నారని తెలుస్తోంది. శనివారం రాత్రి, తీస్ హజారీ కోర్టు బిభవ్ కుమార్‌ను ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది, ఆరోపించిన దాడి గురించి విచారించడానికి ,అతని ఫోన్ నుండి డేటాను తిరిగి పొందడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ పోలీసుల బృందం ఆయనను ముఖ్యమంత్రి నివాసం నుంచి తెల్లవారుజామున అరెస్టు చేసింది. కుమార్ అరెస్ట్ అయిన కొన్ని గంటల తర్వాత, కేజ్రీవాల్,ఆదివారం నాడు బిజెపి కార్యాలయానికి నిరసన ప్రదర్శన చేస్తానని ప్రకటించిన సంగతి విదితమే.