Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ 'మధ్యతరగతి మ్యానిఫెస్టో' విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తాజాగా 'మధ్యతరగతి మ్యానిఫెస్టో'ను విడుదల చేసింది.
ఈ మ్యానిఫెస్టోలో మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో ఆప్ పార్టీ ఎంపీలు ప్రతిపాదించే ఏడు ప్రధాన బడ్జెట్ డిమాండ్లు పొందుపరిచారు.
బుధవారం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దీనిని విడుదల చేశారు.
"భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు పన్నుల భారంతో ఇబ్బందులు పడుతున్నారు. పన్నుల బాధితులుగా మారి, అధికంగా చెల్లిస్తుండగా, తక్కువ ప్రయోజనాలు పొందుతున్నారు" అని కేజ్రీవాల్ తెలిపారు.
వివరాలు
ప్రజల సొమ్మును వారి సంక్షేమానికి వినియోగిస్తే..
దిల్లీలో వృద్ధులకు మెరుగైన వైద్యం, సంక్షేమం అందించేందుకు తాము సంజీవని పథకాన్ని ప్రారంభించామని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పన్ను చెల్లింపుదారుల సొమ్మును వారి సంక్షేమానికి వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే కొందరు దీన్ని ఉచితంగా విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.
"విదేశాల్లో ఇలాంటి పథకాలు అమలు చేస్తే మనం మెచ్చుకుంటాం. కానీ మన దేశంలో చేస్తే ఉచితాలని అంటారు. ప్రజల సొమ్మును వారి సంక్షేమానికి వినియోగిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది" అని ఆయన అన్నారు.
వివరాలు
ఆప్ ప్రతిపాదించిన ఏడు డిమాండ్లు:
1. విద్య: విద్య బడ్జెట్‌ను 2% నుంచి 10%కి పెంచడం, ప్రైవేటు పాఠశాలల ఫీజులను నియంత్రించడం.
2. ఉన్నత విద్య: మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యకు రాయితీలు కల్పించడం.
3. ఆరోగ్యం: ఆరోగ్య బడ్జెట్‌ను 10%కి పెంచడం, ఆరోగ్య బీమాపై పన్నును తొలగించడం.
4. ఆదాయపు పన్ను: మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం.
5. జీఎస్టీ: నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తొలగించడం.
6. సీనియర్ సిటిజన్ల సంక్షేమం: వృద్ధుల కోసం మెరుగైన పింఛను పథకాలు ప్రవేశపెట్టడం.
7. రైల్వే రాయితీలు: సీనియర్ సిటిజన్లకు రైల్వేలో 50% రాయితీ కల్పించడం.