దిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి
దిల్లీలోని తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు దాడి చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఈ దాడిలో ఇంటి కిటికీ ధ్వంసమైనట్లు చెప్పారు. హైసెక్యూరిటీ జోన్‌లో రాళ్ల దాడి జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ మేరకు రాళ్లదాడి జరిగిన ఇంటి దృశ్యాలను ఆయన ట్వీట్ చేశారు. తన ఇంటిపై రాళ్ల దాడి జరగడం 2014 నుంచి ఇది నాలుగోసారి అని అసదుద్దీన్ వెల్లడించారు.
రాళ్లదాడి జరిగిన ఇంటి దృశ్యాలను ట్వీట్ చేసిన అసదుద్దీన్
దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఒవైసీ
ఇంటి పని మనిషి దాడి జరిగిన విషయాన్ని చెప్పడంతో జైపూర్‌లో ఒవైసీ హుటాహుటిన దిల్లీకి వచ్చారు. ఈ విషయంపై ఒవైసీ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు మేరకు అదనపు డీసీపీ నేతృత్వంలోని దిల్లీ పోలీసుల బృందం ఓవైసీ నివాసానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలను సేకరించారు. హైసెక్యూరిటీ జోన్‌లో రాళ్ల దాడి జరగడం ఆందోళనకరమని, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఒవైసీ పోలీసులను కోరారు.