ఎన్నికల వేళ తెలంగాణలో కీలక నిర్ణయం..మరోసారి ఆసరా పెన్షన్ల పెంపు దిశగా సర్కార్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ఆసరా పెన్షన్ల పెంపు ఉండనుంది. ఆదివారం సూర్యాపేటలో జరిగిన ప్రగతినివేదన సభలో ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఆసరా పెన్షన్ మొత్తాన్ని రూ.1000 చొప్పున పెంచేందుకు గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలు, ఆర్థిక శాఖకు చేరుకున్నాయి. 39 లక్షల మందికి నెలకు రూ.1,000 పెంపుతో ఖజానాపై రూ.450 కోట్ల అదనపు భారం పడనున్నట్లు ఆర్థిక వర్గాల అంచనా. ఇటీవలే 5,16,890 మంది దివ్యాంగులకు వెయ్యి చొప్పున పెన్షన్ పెరిగింది. ఈ మేరకు రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సీఎం సంతకం తర్వాత రూ.2016 నుంచి 3016కు పెరిగే అవకాశం
ప్రస్తుతం ఆసరా లబ్ధిదారులకు రూ.2,016 పెన్షన్ అందుతోంది. వీరికి వెయ్యి పెంచి రూ.3,016 మొత్తాన్ని మంజూరీ చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఫైలు సిద్ధమైంది. సీఎం సంతకం చేశాక దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మరోవైపు సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్ ప్రకటనపై ఆసరా పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.11,628 కోట్లు ఖర్చుతో 44,82,254 మందికి ఆసరా పథకం కింద ప్రభుత్వం ఇప్పటికేే పెన్షన్లు అందిస్తూ వస్తోంది. వృద్ధులు, వితంతువులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ రోగులు పెన్షన్ అందుకుంటున్నారు.