అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం తెలంగాణ ప్రభుత్వం గోల్గొండ కోటలో నిర్వహించారు. గోల్కొండ కోటలో వరుసగా పదోసారి జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రగతిని చదవి వినిపించారు. తెలంగాణకు దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం సరిదిద్దుతోందని స్పష్టం చేశారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 76 సంవత్సరాల్లో పురోగతి సాధించినప్పటికీ, ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం దృఢమైన సంకల్పం కారణంగా 10 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చేసినట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
10 ఏళ్లలోనే గణనీయమైన పురగోతి: కేసీఆర్
గత ప్రభుత్వాల పాలనలో కరవు, నీరు, విద్యుత్ కొరత, వ్యవసాయ కష్టాలతో ఈ ప్రాంతం సతమతమైనట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. 10 ఏళ్లలో ఆయా రంగాల్లో గణనీయమైన పురగోతి సాధించినట్లు వివరించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్‌ఐఎస్)తో సహా విస్తృతమైన కాల్వలు, రిజర్వాయర్‌ల నెట్‌వర్క్‌తో గోదావరి నది ఇప్పుడు తెలంగాణ భూముల్లో పరుగులు పెడుతుతోందన్నారు. పర్యావరణ అనుమతులకు అడ్డంకులు తొలగిపోవడంతో పాలమూరు రంగారెడ్డి ఎల్‌ఐఎస్‌ను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి త్వరలో నీటి పంపింగ్‌ను ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని పవిత్ర కార్యంగా చేపట్టిందన్నారు.
ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామి: కేసీఆర్
కఠోర శ్రమ, నిజాయితీ, నిబద్ధతతో విధ్వంసానికి గురైన తెలంగాణను తక్కువ వ్యవధిలోనే అభివృద్ధి పథంలో విజయవంతంగా నడిపించామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అనేక రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఇప్పుడు అన్ని విధానాల్లోనూ 'తెలంగాణ ఆచరిస్తోంది, దేశం అనుసరిస్తుంది' అనే స్థాయికి చేరుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. సంక్షేమ ప్రయోజనాలు సమాజంలోని అట్టడుగు వర్గాల నుంచి అగ్రవర్ణాలలోని పేదల వరకు చేరుకుంటున్నాయన్నారు. ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని సీఎం అన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం వంటి కీలక ఆర్థిక సూచికల్లో తెలంగాణ టాప్‌లో ఉందన్నారు. తెలంగాణ పేదరికం రేటు 2015-16లో 13.18శాతం ఉంటే, 2019-21లో 5.88 శాతానికి పడిపోయిందని, ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధిని సూచిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.