LOADING...
Assam CM Himanta: అక్టోబర్ నుండి వాళ్లకు ఆధార్ కార్డ్ ఇచ్చే ప్రసక్తే లేదుః అస్సాం సీఎం హిమంత
అక్టోబర్ నుండి వాళ్లకు ఆధార్ కార్డ్ ఇచ్చే ప్రసక్తే లేదుః అస్సాం సీఎం హిమంత

Assam CM Himanta: అక్టోబర్ నుండి వాళ్లకు ఆధార్ కార్డ్ ఇచ్చే ప్రసక్తే లేదుః అస్సాం సీఎం హిమంత

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

అసోం రాష్ట్ర ప్రభుత్వం అక్రమ వలసదారుల ప్రవేశాన్ని నియంత్రించడానికి, బంగ్లాదేశ్ నుండి చొరబడే వలసదారులను చెక్ పెట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రం లో ఆధార్ కార్డు జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు సీఎం హిమంత బిస్వా శర్మ గురువారం (ఆగస్టు 21) కేబినెట్ సమావేశం అనంతరం ప్రకటించారు. ముఖ్యంగా అక్టోబర్ నుండి 18 ఏళ్ల పైబడినవారికి ఆధార్ కార్డులు ఇవ్వమని స్పష్టం చేశారు. అంటే, ఇకపై 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న ఎవరికి ఆధార్ కార్డు ఇవ్వరని అర్థం. కానీ, ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినవారికి, అలాగే తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులకు మాత్రం మినహాయింపునిచ్చింది..

వివరాలు 

ఆధార్ కార్డుల జారీపై కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానం

అసోం ప్రభుత్వం సరిహద్దు భద్రతను దృఢంగా ఉంచడం,అక్రమ వలసలను అడ్డుకోవడం కోసం ఈ చర్యలు అవసరమని చెబుతోంది. సీఎం హిమంత్ శర్మ ప్రకారం,ఇకపై ఏ బంగ్లాదేశీయుడికి అసోంలోకి చొరబడిన తర్వాత ఆధార్ కార్డు పొందడానికి, భారత పౌరుడిగా చెలామణీ కావడానికి అవకాశాలు ఉండవు అని స్పష్టం చేశారు. అక్రమ వలసదారులు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారిపై పర్యవేక్షణను పెంచడానికి, ఆధార్ కార్డుల జారీపై కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానం రూపొందించి,మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన అర్హులు,ఎవరైనా ఆధార్ కార్డు పొందాలనుకుంటే,నిర్దిష్ట గడువులో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. 18ఏళ్లు పూర్తి చేసుకున్న,ఇంకా ఆధార్ కోసం నమోదు చేసుకోని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

వివరాలు 

 20 లక్షల పైగా బంగ్లాదేశీయులు 

సెప్టెంబర్ తర్వాత ఆధార్ నమోదు చాలా కష్టంగా మారుతుందని, అత్యవసర పరిస్థితులు కాకుండా నమోదు జరగవని ప్రభుత్వం హెచ్చరించింది. ఆధార్ కార్డు జారీ కోసం జిల్లా కలెక్టర్ ఆమోదం,ఫారెనర్స్ ట్రిబ్యునల్ నుండి "నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్" తప్పనిసరి. 2001 జనాభా లెక్కల ప్రకారం,అసోమ్‌లో 20 లక్షల పైగా బంగ్లాదేశీయులు ఉన్నారని గుర్తించారు. ప్రస్తుతం ఆ సంఖ్య కోటి పైగా ఉందని అంచనా.సెప్టెంబర్ 2024లో నాలుగు జిల్లాలలో.. బార్పేట్, ధుబ్రి,మోరిగావ్,నాగావ్ - ఆధార్ కార్డుల సంఖ్య అంచనా వేసిన జనాభా కన్నా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో బెంగాలీ మాట్లాడే ముస్లిం వర్గం ఎక్కువగా ఉంది.