భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య
ఓ మహిళ తన భర్త, అత్తను హత్య చేసి, వారి మృతదేహాలను ముక్కలుగా నరికి మూడు రోజులు ఫ్రిజ్‌లో ఉంచింది. ఈ ఘటన అసోంలోని గువాహటిలో జరిగింది. ఆ తర్వాత మృతదేహాలను మేఘాలయలో పారవేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. దాదాపు ఏడు నెలల క్రితం జరిగిన జంట హత్యకు సంబంధించిన ఈ కేసులో ప్రధాన నిందితురాలు కలిత, ఆమె స్నేహితుడు అరూప్ దాస్‌తో పాటు వీరికి సహకరించిన ధంజిత్ దేకా అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. భర్త అమరేంద్ర, అత్తను హత్య చేసిన తర్వాత, తనకేమి తెలియదన్నట్లు గవాహటిలోని నూన్‌మతి పోలీస్ స్టేషన్‌లో వారు కనిపించడం లేదని కలిత ఫిర్యాదు చేసింది. అప్పుడు విచారించినా కేసులో పురోగతి కనిపించలేదని పోలీసులు తెలిపారు.
కొన్ని మృతదేహాల భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
కొంతకాలం తర్వాత కలిత భర్త అమరేంద్ర బంధవు, వీరు మిస్ అయినట్లు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్నిరోజులు ఆగి అతడు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసును సీరియస్‌గా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. భార్యపై అనుమానంతో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించినట్లు గువాహటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దిగంత కుమార్ తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. భర్త, అత్త మృతదేహాలను ముక్కలుగా నరికి, ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి, ఆపై వాటిని మేఘాలయకు తరలించి, అక్కడ అడవిలో పారేశారని, కొన్ని భాగాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.