Elections Results: హర్యానా, జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. దీని కోసం ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ ప్రారంభంలో మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపడతారు. మధ్యాహ్నం వరకు ఫలితాలపై స్పష్టత రావచ్చని అంచనా. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటాల్సి ఉంటుంది. హర్యానాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమాగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ కూడా విజయం తమదేననే ఆశతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్‌కే అనుకూలంగానే తీర్పునిచ్చాయి.
జమ్ముకశ్మీర్ లో హంగ్ ఏర్పడే అవకాశం
దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. జమ్ముకశ్మీర్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇక స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య 464గా ఉంది. ఈ నెల 5న ఇక్కడ పోలింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్‌లో 90 స్థానాలకు 873 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మూడు విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 63.45 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మూకశ్మీర్‌కు కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత నిర్వహించిన ఈ ఎన్నికలు, అక్కడి తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం విశేషం.