
Narendra Modi: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కొత్త రికార్డును సృష్టించారు. ఎర్రకోట పై బురుజుల నుంచి తన రాజకీయ ప్రస్థానంలోనే అతి పెద్ద వ్యవధి గల ప్రసంగాన్ని ఇస్తూ, గతంలో తానే నెలకొల్పిన రికార్డును మళ్లీ తన చేతిలోనే అధిగమించారు. ఈసారి ఆయన 105 నిమిషాల పాటు నిరవధికంగా ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉదయం 7 గంటల 33 నిమిషాలకు ప్రారంభమైన మోదీ ప్రసంగం,ఉదయం 9 గంటల 18 నిమిషాలకు ముగిసింది. మొత్తం గంటా 45 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగం, గత సంవత్సరం (2024) ఆయన చేసిన 98 నిమిషాల ప్రసంగ రికార్డును చెరిపేసింది.
వివరాలు
నెహ్రూ తర్వాత రెండో స్థానంలో నిలిచిన మోదీ
ఈ ప్రసంగం ద్వారా మోదీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఎర్రకోట నుంచి వరుసగా 12వ సారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సాధించిన రికార్డును అధిగమించారు. ఇప్పటివరకు అత్యధికంగా 17 సార్లు వరుస ప్రసంగం చేసిన రికార్డు మాత్రం జవహర్‌లాల్ నెహ్రూ పేరుమీదే ఉంది. మోదీ గతంలో కూడా అనేక సార్లు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. 2016లో 96 నిమిషాలు, 2019లో 92 నిమిషాలు, 2023లో 90 నిమిషాల పాటు ప్రసంగించారు.
వివరాలు
ప్రభుత్వ విజయాలు, 2047 లక్ష్యాలపై ప్రసంగంలో ప్రస్తావన
అయితే, 2017లో మాత్రం కేవలం 56 నిమిషాల వ్యవధిలోనే తన ప్రసంగాన్ని ముగించడం విశేషం. ఈ సారి ఆయన చేసిన విస్తృత ప్రసంగంలో, ప్రభుత్వ విజయాలను సమగ్రంగా ప్రస్తావించారు. 'నయా భారత్' నిర్మాణ దిశగా చేపట్టిన చర్యలు, అలాగే 2047 నాటికి 'వికసిత భారత్' సాధన లక్ష్యాన్ని ఉద్దేశిస్తూ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను దేశ ప్రజల ముందుంచారు.