Atchutapuram SEZ explosion: అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు..17మంది మృతి.. 60 మందికి తీవ్ర గాయాలు
అచ్యుతాపురం ఫార్మా యూనిట్‌లో బుధవారం పేలుడు సంభవించి, 17 మంది మరణించారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు మధ్యాహ్న భోజనం కారణంగా ప్లాంట్‌లో తక్కువ మంది కార్మికులు ఉన్నారు. గాయపడిన కార్మికులలో ఓ మహిళా కార్మికురాలి శరీరం చెట్టుకొమ్మకు వేలాడి పేగులు బయటకు రాగా,మరికొందరు మంటల్లో కాలిపోయి చనిపోయారు.పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకుని చనిపోయిన కార్మికులు కూడాఎక్కువగా ఉన్నారు. ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ(Escientia Advanced Science Pvt Ltd)లో మధ్యాహ్నం 2:15 గంటలకు ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన స్థలాన్ని అనకాపల్లి కలెక్టర్ విజయ్‌కృష్ణన్, ఎస్పీ దీపికాపాటిల్, తెదేపా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు సందర్శించారు.
ఘటనాస్థలిని సందర్శించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
గురువారం ఘటనాస్థలిని సందర్శించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ విషాద సంఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ కెమికల్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలను (API) తయారు చేసే కంపెనీ ఏప్రిల్ 2019 లో రూ. 200 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది అచ్యుతాపురం క్లస్టర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) బహుళ-ఉత్పత్తి SEZలో 40 ఎకరాల క్యాంపస్‌లో ఉంది. ప్రమాదంపై రాంబిల్లీ పోలీసులు ఎసైన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యంపై BNS 106 (1), 125(b),125(a) సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.