Delhi CM : దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి..?
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తన పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. కేజ్రీవాల్ రాజీనామాతో ఢిల్లీలో ముందస్తు ఎన్నికల డిమాండ్ పెరుగుతోంది. ప్రజల నుంచి నిజాయితీకి సర్టిఫికెట్ పొందే వరకు తాను సీఎం పదవిలో కొనసాగనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ రాజీనామా అనంతరం సీఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారనే విషయంపై చర్చ సాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీలో విద్యాశాఖ మంత్రి అతిషి పేరు ఈ రేసులో ముందంజలో ఉంది.
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న అతిషి
కేజ్రీవాల్ కు సన్నిహితురాలిగా, ముఖ్యంగా మనీష్ సిసోడియా జైలులో ఉన్న సమయంలో, అతిషి పార్టీ కార్యకలాపాలు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. కేజ్రీవాల్‌కు అత్యంత విశ్వసనీయులలో అతిషి ఒకరని చెప్పొచ్చు. ఆప్ సీనియర్ నాయకులు జైలులో ఉన్న సమయంలో అతిషి పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2020 ఎన్నికల తర్వాత గోవా యూనిట్‌కి ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన అనుభవం అతిషికి ఉంది. ఇక కేజ్రీవాల్ రాజీనామాతో ప్రజలను తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.