Atishi: సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం
దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ వైదొలిగారు.తన వారసురాలిగా అతిషి మార్లెనా సింగ్‌ను ప్రకటించారు. మంగళవారం జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేల సమావేశంలో ఆమెను శాసనసభాపక్ష నాయకిగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో, అతిశీ శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. ఆమె ప్రమాణ స్వీకారానికి సెప్టెంబరు 21 తేదీని ప్రతిపాదించిన లెఫినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఈ విషయాన్ని బుధవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తెలియజేశారని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం పదవికి రాజీనామా చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సమర్పించిన లేఖను కూడా రాష్ట్రపతికి పంపించారని పేర్కొన్నారు. రాష్ట్రపతిదే తుది నిర్ణయమని, ఆమోదం పొందిన తర్వాతే ప్రమాణస్వీకారం జరుగుతుందని చెప్పారు.
కేజ్రీవాల్ భద్రతపై ఆందోళనలు
ఇక, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ తన అధికారిక నివాసం, వాహనాలు తదితర వసతులన్నింటినీ వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. 15రోజుల్లో అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సాధారణ వ్యక్తిగా జీవిస్తారని ఆప్ బుధవారం తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.ఢిల్లీలో ఆయనకు తగిన నివాసం కోసం అన్వేషిస్తున్నట్లు సింగ్ చెప్పారు. గతంలో కేజ్రీవాల్‌పై పలు దాడులు జరిగే కారణంగా ఆయన భద్రతపై ఆందోళనలు ఉన్నాయని సింగ్ తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న అరెస్టైన కేజ్రీవాల్,ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే,కోర్టు ఆయనకు సీఎంగా అధికారిక నిర్ణయాలు,ఫైళ్లపై సంతకాలు చేయరాదని షరతులు విధించింది.
ప్రజా తీర్పు అనంతరం మళ్లీ సీఎంగా బాధ్యతలు: కేజ్రీవాల్
ఈ పరిస్థితుల్లో, కేజ్రీవాల్ తీవ్ర మనస్తాపం చెందినప్పటికీ, ప్రజా తీర్పు అనంతరం మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపడతానని ప్రకటించారు. తన స్థానంలో వేరొకరు సీఎం అవుతారని ఆప్ కార్యకర్తల సమావేశంలో ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు నేతల పేర్లను పరిశీలించారు. కేజ్రీవాల్ సతీమణి సునీత కూడా రేసులో ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ, చివరకు విధేయురాలైన అతిశీని ఎంపిక చేశారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో అన్ని పాలనా వ్యవహారాలు అతిశీ నిర్వహించారు.