భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆత్రేయపురం పూతరేకులు
కొన్ని కొన్ని ఆహార పదార్థాలు కొన్ని ప్రాంతాల్లోనే తయారవుతాయి. అలాగే అవి ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. అలాంటి ఆహార పదార్థాల్లో ఆత్రేయపురం పూతరేకులు ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం గ్రామానికి చెందిన పూతరేకులు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. విదేశాల్లో సైతం ఈ పూతరేకులు లభిస్తాయి. అయితే ప్రస్తుతం ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు(జీఐ ట్యాగ్) లభించింది. ఈ విషయాన్ని ఆత్రేయపురానికి చెందిన సర్ ఆర్దర్ కాటన్ పూతరేకుల సంఘం వెల్లడి చేసింది. ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ ఇవ్వడంలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే జూన్ 13వ తేదీలోగా తెలియజేయాలని ఫిబ్రవరి 13వ తేదీన జియోగ్రాఫికల్ ఇండికేషన్ జర్నల్ లో ప్రచురించింది.
జీఐ ట్యాగ్ ఉపయోగాలు
గడువు తేదీ వరకు ఎలాంటి అభ్యంతరాలు రానందున పూతరేకలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించింది. జీఐ ట్యాగ్ వలన ఉపయోగాలు: జీఐ ట్యాగ్ పొందిన ఏ ఉత్పత్తినైనా ఇతర ప్రాంతాల వారు తయారు చేయడానికి వీలు లేదు. ఆ ఉత్పత్తి ఆ ప్రాంతాన్ని గుర్తు చేస్తుంది. అందువల్ల ఎవ్వరు కూడా అలాంటి ఉత్పత్తిని తయారు చేయడానికి వీలుపడదు. ఇండియాలో మొట్టమొదటి జీఐ ట్యాగ్ అందుకున్న ఉత్పత్తి డార్జిలింగ్ టీ. తిరుపతి లడ్డూకు కూడా జీఐ ట్యాగ్ ఉంది. నిర్మల్ కొయ్యబొమ్మలు, పోచంపల్లి ఇక్కత్ డిజైన్ కు కూడా భౌగోళిక గుర్తింపు లభించింది.