Chennai : చెన్నైలో దారుణం.. తల్లికి సరైన వైద్యం చేయలేదని వైద్యుడిని కత్తితో పొడిచిన కొడుకు
చెన్నైలోని గిండీ ప్రాంతంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన తల్లికి తగిన వైద్యం అందలేదన్న కోపంతో 26 ఏళ్ల యువకుడు అక్కడి వైద్యుడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన సదరు వైద్యుడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని ఆ యువకుడు గిండీ ప్రాంతంలోని కలైంజర్ సెంటినరీ ఆస్పత్రిలో ఈ ఏడాది మే నుంచి చికిత్స చేయిస్తున్నాడు. అయితే ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన యువకుడు ఈ ఉదయం వైద్యుడిపై ఆకస్మికంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ఆస్పత్రిని సందర్శించిన తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి
ఈ దాడిలో వైద్యుడి ఛాతీ, ముఖం సహా ఇతర భాగాల్లో గాయాలయ్యాయి. వైద్యుడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పరారయ్యే ప్రయత్నం చేస్తున్న యువకుడిని ఆసుపత్రి సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియమ్ ఆసుపత్రిని సందర్శించి వైద్యుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.