Attacks on Indians: అమెరికా,యూకే, కెనడాల్లో భారతీయులపై వరుస దాడులు.. ఐదేళ్లలో 302 ఘటనలు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఈ ఘటనలు ఏకంగా ఏడు రెట్లు పెరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021లో భారతీయులపై 15 దాడులు నమోదవగా.. 2025 నాటికి ఆ సంఖ్య 104కు చేరింది. రాజ్యసభలో విదేశాంగ శాఖ 36 దేశాలకు సంబంధించిన గణాంకాలను వెల్లడించింది.
వివరాలు
అమెరికాలో అత్యధిక ఘటనలు
2021 నుంచి 2025 మధ్య మొత్తం 302 దాడులు నమోదయ్యాయి.
ఏడాది వారీగా చూస్తే.. 2021లో 15, 2022లో 31, 2023లో 67, 2024లో 85, 2025లో 104 ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ గణాంకాలు విదేశాల్లో భారతీయులపై దాడుల సంఖ్య ఏటా పెరుగుతున్న తీరును స్పష్టం చేస్తున్నాయి.
గత ఐదేళ్లలో అత్యధికంగా అమెరికాలో 33 దాడులు నమోదయ్యాయి. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 32, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో 31, కెనడాలో 30 ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఐర్లాండ్‌లో 24, రష్యాలో 23, జర్మనీలో 19 దాడులు నమోదైనట్లు విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడించాయి.
వివరాలు
భారతీయుల భద్రతే అత్యంత ప్రాధాన్యత
విదేశాల్లో భారతీయులపై జరుగుతున్న దాడులపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు.
విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని స్పష్టం చేశారు.
భారతీయులపై ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే సంబంధిత దేశ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.
ఘటనలపై సమగ్ర విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అలాగే దాడులకు పాల్పడిన నిందితులకు ఆయా దేశాల చట్టాల ప్రకారం శిక్ష పడేలా సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.