Kalindi Express: కాన్పూర్‌లో ట్రాక్ పై ఎల్‌పిజి సిలిండర్.. రైలు పట్టాలు తప్పించే ప్రయత్నం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్ రైలు పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆదివారం రాత్రి, ప్రయాగ్‌రాజ్ నుంచి హరియాణా భివానీ వెళ్తున్న రైలు శివరాజ్‌పుర్ ప్రాంతంలో ట్రాక్‌పై ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టింది. లోకో పైలట్ ట్రాక్‌పై అనుమానాస్పద వస్తువును గమనించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అయినప్పటికీ, రైలు సిలిండర్‌ను ఢీకొనడంతో అది దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అదృష్టవశాత్తూ, ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ట్రాక్‌పై ధ్వంసమైన సిలిండర్, పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్ట
ఈ ఘటనను లోకో పైలట్ రైల్వే గార్డుకు తెలియజేయగా, వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్,ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు చేపట్టాయి. ట్రాక్‌పై ధ్వంసమైన సిలిండర్, పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టను గుర్తించారు. ఈ వస్తువులు కావాలనే గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాలు తప్పించేందుకు ఉంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటన వల్ల రైలు దాదాపు అరగంట నిలిచిపోయింది, తర్వాత అది దాని గమ్యస్థానానికి బయలుదేరింది.