Supreme Court: సీజేఐపై దాడి యత్నం.. లాయర్‌పై ధిక్కార చర్యలకు అనుమతి లేదు!
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీం కోర్టు ప్రాంగణంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై (CJI Justice BR Gavai) ఓ న్యాయవాది దాడి యత్నం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం కీలకమైంది. దాడికి పాల్పడిన న్యాయవాది రాకేశ్ కిశోర్‌పై కోర్టు ధిక్కార చర్యలకు అనుమతి ఇవ్వమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీజేఐ స్వయంగా ఆ న్యాయవాదిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవడంలో జస్టిస్ గవాయ్ ఆసక్తి చూపలేదని పేర్కొంది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం — జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీలతో కూడిన బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.
Details
న్యాయమూర్తి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది
కోర్టులో నినాదాలు చేయడం, బూట్లు విసరడం వంటి చర్యలు ధిక్కారంగా పరిగణించవచ్చని పేర్కొన్నప్పటికీ, చట్టపరంగా దానిపై ముందుకు వెళ్లాలా వద్దా అనేది సంబంధిత న్యాయమూర్తి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఘటనలో ధిక్కార నోటీసులు జారీ చేయడం వలన ఆ న్యాయవాదికి అనవసర ప్రాధాన్యం దక్కుతుందని బెంచ్ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు హామీ ఇచ్చింది. ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా లాయర్ రాకేశ్ కిశోర్ తన కాలి బూటుతో సీజేఐపై దాడికి యత్నించగా, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకున్నారు.
Details
సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు
ఆ సమయంలో కిశోర్ సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదంటూ నినాదాలు చేశాడు. ఈ ఘటనపై సీజేఐ స్పందిస్తూ ఇలాంటి బెదిరింపులు నన్ను ఎప్పటికీ ప్రభావితం చేయవని అన్నారు. ఘటన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాజకీయ పార్టీలు, న్యాయవాదుల సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. అనంతరం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ రాకేశ్ కిశోర్ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు, కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించే అనుమతిని కూడా రద్దు చేసింది.