లోక్‌సభలో దుమారం.. కేంద్రమంత్రి నారాయణ రానే పై విపక్షాలు ధ్వజం
లోక్‌సభలో కేంద్రమంత్రి నారాయణ రానే ప్రవర్తన దుమారం రేపుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా సహచర ఎంపీని ఉద్దేశిస్తూ మంగళవారం రానే చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివసేన (UTB) ఎంపీ అరవింద్ సావంత్ పై కేంద్రమంత్రి సహనం కోల్పోయి ప్రవర్తించారు. ప్రధానిపై వ్యాఖ్యలు చేసే స్థాయి సావంత్‌కు లేదంటూ రానే తీవ్ర స్వరం పెంచారు. సావంత్ మీరు కూర్చోండి ప్రధాని మోదీ, అమిత్ షాలపై మాట్లాడే స్థాయి మీకు లేదు. అయినప్పటికీ మీరు మాట్లాడదల్చుకుంటే దాని పరిణామాలు ఎదుర్కొంటారు అంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రవర్తనను విపక్షాలు ఖండించాయి. సదరు మంత్రిని సభ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి.
సెంట్రల్ మినిస్టర్ నారాయణ రానే పై ఆప్ తీవ్ర ఆగ్రహం
ఈ నేపథ్యంలోనే కలగచేసుకున్న స్పీకర్, సదరు మంత్రిని మందలించారు. పదజాలం చూసుకుని మాట్లాడాలంటూ హితబోధ చేశారు. మరోవైపు మంత్రి రానే ప్రవర్తనపై ఆప్ తీవ్రంగా మండిపడింది. ఒక రౌడీ మాదిరిగా మంత్రి రానే పార్లమెంట్‌లో బెదిరింపులకు దిగారని ఆక్షేపించింది. మోదీ సర్కారును ప్రశ్నించే విపక్షాలను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేస్తారా అని ఆందోళన వ్యక్తం చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసే భాజపా మంత్రిని మాత్రం సస్పెండ్ చేస్తారా లేదా అని ప్రశ్నించింది. మంత్రి నారాయణ రానే, తన మాటల తీవ్రతతో కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలను సూచిస్తున్నారని శివసేన (UTB) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు.