Avadh Ojha: ''కేజ్రీవాల్ కృష్ణావతారం''.. ఆప్ చీఫ్‌పై అవధ్ ఓజా ప్రశంసలు..
యూపీఎస్సీ కోచింగ్‌లో పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత విద్యావేత్త అవధ్ ఓజా ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. ఇటీవల ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన, కేజ్రీవాల్‌ను దేవుడితో పోల్చారు. ఒక ఇంటర్వ్యూలో అవధ్ ఓజా మాట్లాడుతూ, "అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా దేవుడే. ఆయన కృష్ణుని అవతారమని ఇదివరకే చెప్పాను. ఎవరైనా సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించినప్పుడు, వారు పేదలకు మెస్సయ్యగా మారుతారు, సామాజిక దురాచారాలను రూపుమాపడానికి ప్రజలు ఆయన వెంట నడుస్తారు" అని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ భగవంతుడని నాకు ఎలాంటి సందేహం లేదు: అవధ్
కేజ్రీవాల్ పేదల కోసం చేసిన సేవలు కొన్ని సామాజిక దుష్టులకు ఇష్టం లేదని, ఢిల్లీలో కేజ్రీవాల్ అమలు చేసిన పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, 2029 నాటికి ఆయన భారతదేశ ప్రధాని అవుతారని కొందరు భయపడుతున్నారని చెప్పారు. అంతేకాకుండా, "కేజ్రీవాల్ భగవంతుడని నాకు ఎలాంటి సందేహం లేదు. ఆయన విద్యను ఉచితంగా అందించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేశారు" అని ఆజా అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, అవధ్ ఓజా రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్పర్‌గంజ్ నియోజకవర్గం నుంచి ఆప్ తరపున పోటీ చేయబోతున్నారు.
జంగ్‌పురా నియోజకవర్గం నుంచి సిసోడియా పోటీ
గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పోటీ చేశారు. అయితే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో సిసోడియా జంగ్‌పురా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ గోండా జిల్లాకు చెందిన అవధ్ ఓజా, యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణ అందించడంలో ప్రఖ్యాతి పొందారు. అంతేకాకుండా, అంతర్జాతీయ, దేశీయ రాజకీయాలపై తన లోతైన విశ్లేషణతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.