Vijayawada: విజయవాడలో రేపు 'ఆవకాయ్, అమరావతి' ఉత్సవాలు ప్రారంభం..
ఈ వార్తాకథనం ఏంటి
మూడు నెలల క్రితం విజయవాడలో ప్రజలను ఉర్రూతలూగించిన ఉత్సవాల తర్వాత, కొన్ని రోజులుగా పుస్తక మహోత్సవం ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తోందంటే, ఇప్పుడు ఆవకాయ్-అమరావతి ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. తెలుగు సినిమా, సాహిత్యం,కళల వైభవాన్ని ప్రతిబింబించే పలు కార్యక్రమాలకు విజయవాడ మళ్ళీ వేదికగా మారనుంది. కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్,భవానీ ఐలాండ్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా మూడు రోజులపాటు ఆవకాయ్-అమరావతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. సంగీతం, నృత్యం, నాటకం, కవిత్వం, కథా విన్యాసం, సదస్సులు, సాంస్కృతిక సంభాషణలు వంటి విభిన్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు సంక్రాంతి సీజన్ ముందస్తుగా ఉత్సవ వాతావరణాన్ని అనుభూతి చెందించనున్నారు. ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం (8న) పున్నమి ఘాట్‌లో ప్రారంభిస్తారు.
వివరాలు
9న శుక్రవారం ప్రత్యేక చర్చలు
ఈ సందర్భంగా తోలుబొమ్మల ఊరేగింపు, తీన్‌మార్ డప్పులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అనంతరం జామర్స్ సంగీతం, ఘాట్‌లో హారతి, హౌస్‌బోటు ప్రారంభోత్సవం, శంఖం-నగారా-డ్రమ్స్‌తో ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతాయి. 9న శుక్రవారం భవానీ ద్వీపంలో 'సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్ర'పై నిర్వహించే చర్చలో ఎస్.హుస్సేన్ జైదీ, యండమూరి వీరేంద్రనాథ్, సుధీర్ మిశ్ర పాల్గొంటారు. 'భారతీయ పురాణాలు, పురోగమనం'చర్చలో కస్తూరి మురళీకృష్ణ, సంజీవ్ పస్రిచా, అనురాధ మోతాలి పాల్గొంటారు. 'ఓటీటీ యుగంలో సినిమా ప్రభావం' చర్చలో లీనాయాదవ్, సునీల్ చైనాని, శిబాసిన్ సర్కార్, సౌగత ముఖర్జీ, శ్రీరూప మిత్ర, సుప్రియా యార్లగడ్డ పాల్గొంటారు. అదనంగా, మార్షల్ ఆర్ట్స్ (ఆదిత్య రాయ్), నగాడా (నతూలాల్ సోలంకి),బొమ్మల తయారీ (షమీమ్), నృత్యం (గిల్లెస్ చుయెన్-ఫ్రాన్స్)పై ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు.
వివరాలు
తెలుగు సాహిత్యం-సినిమా వైభవం, అనువాద కళపై చర్చలు
సాయంత్రం పున్నమి ఘాట్‌లో కర్ణాటక సంగీతం (చంద్రన బాల కల్యాణ్),కూచిపూడి నృత్య నాటకం (వనశ్రీరావు) ప్రదర్శింపబడుతుంది. 'సినిమాలో సంగీతం, కవిత్వం' చర్చలో శేఖర్ రవి జియాని, ప్రియా సరయ్యా, కాసర్ల శ్యామ్, రక్షందా జలీల్ పాల్గొంటారు. అనంతరం అనిరుద్ వర్మ కలెక్టివ్, నిజామీ బంధు ద్వారా 'ఆజ్ రంగ్ హై' సంగీత ప్రదర్శన ఉంటుంది. 10న శనివారం, భవానీ ద్వీపంలో తెలుగు కథన కళ, సినిమా-జర్నలిజం, తెలుగు సాహిత్యం-సినిమా వైభవం, అనువాద కళపై చర్చలు జరుగుతాయి.
వివరాలు
ఆన్‌లైన్‌లో ఈ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
పున్నమి ఘాట్‌లో సాయంత్రం చౌరస్తా సంగీత ప్రదర్శన, ఎన్టీఆర్ నటనా విశ్వరూపానికి నివాళి, ప్రేమ కథ సంగీత నాటకం, జావేద్ ఆలీ సంగీత కచేరి ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే, హెరిటేజ్ వాక్, ఘాట్ ఫెర్రీ ప్రయాణం, ఫుడ్ ఫెస్టివల్ వంటి ఇతర కార్యక్రమాలు కూడా ప్రజలను ఆకర్షిస్తాయి. ప్రవేశం ఉచితం అని నిర్వాహకులు తెలిపారు. ప్రేక్షకులు ముందుగానే ఆన్‌లైన్‌లో www.avakaifestival.com ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.