
Shubhanshu Shukla: యాక్సియం-4 హీరో శుభాంశు శుక్లా స్వదేశ ప్రయాణం.. మోదీతో భేటీకి రంగం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
యాక్సియం-4 మిషన్‌తో భారత్ రోదసి చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) స్వదేశానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన త్వరలో భారత్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. యాక్సియం-4 మిషన్ విజయవంతం అయిన తర్వాత తొలిసారిగా భారత్ పయనమవుతున్నానని శుక్లా స్వయంగా సోషల్ మీడియా పోస్టు ద్వారా ప్రకటించారు. విమానంలో కూర్చున్న సమయంలో తనకు కలిగిన భావోద్వేగాలను పంచుకున్నారు. మిషన్ కోసం గత ఏడాది నుంచి కుటుంబసభ్యులు,స్నేహితుల నుంచి దూరంగా ఉండాల్సి రావడం తనను ఎంతో కష్టపెట్టిందని తెలిపారు. ఇప్పుడు వారిని కలుసుకుని తన అనుభవాలను పంచుకోవాలనే ఆత్రుతతో ఉన్నానని పేర్కొన్నారు.
Details
సోమవారం మోదీని కలిసే అవకాశం
అదే సమయంలో విమానంలో తీసుకున్న ఫొటోను కూడా శుక్లా పంచుకున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఆదివారం భారత్‌కు రానున్న శుక్లా, సోమవారం మోదీని కలిసే అవకాశం ఉంది. అంతేకాదు, ఈనెల 23న జరగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవంలో కూడా ఆయన పాల్గొనబోతున్నారని వెల్లడించారు. ఇక యాక్సియం-4 మిషన్ విషయానికి వస్తే, ఇటీవల నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైంది. 18 రోజులపాటు రోదసిలో గడిపిన శుభాంశు శుక్లా బృందం, మానవాళికి ఉపయోగకరంగా ఉండే పలు కీలక ప్రయోగాలను నిర్వహించింది. అనంతరం జులై 15న భూమికి తిరిగి వచ్చింది. అయితే భూమికి చేరుకున్న వెంటనే వ్యోమగాములను క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.